అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైయ‌స్ఆర్‌సీపీ వ్యతిరేకం…

2 Apr, 2026 14:55 IST

ఢిల్లీ: అమరావతి చట్టబద్ధత బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ బిల్లుపై పలు కీలక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. “రాజ్యాంగంలో ‘రాజధాని’ అనే అంశంపై స్పష్టమైన ప్రస్తావన లేదని, అయినప్పటికీ ఈ బిల్లుతో రాష్ట్రంపై భారాలు మోపే ప్రయత్నం జరుగుతోందని” ఆయన విమర్శించారు. బిల్లులో ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత ముఖ్యమైన ప్రత్యేక హోదా అంశం ఎక్కడా ప్రస్తావించలేదని, ప్రస్తుత అధికార పార్టీ ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించిందని ఆరోపించారు.

ప్రత్యేక హోదా కోసం వైయ‌స్ఆర్‌సీపీ మాత్రం నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని స్పష్టం చేసిన సుబ్బారెడ్డి, అమరావతి రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అన్నారు. వేలాది ఎకరాల భూములను సేకరించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రైతులకు ఇవ్వాల్సిన ప్లాట్లపై బిల్లులో ఎలాంటి స్పష్టత లేదని, వాటిని ఎప్పుడు అందజేస్తారో కూడా ప్రభుత్వం చెప్పలేకపోతుందని అన్నారు. సుమారు 50 వేల ఎకరాల భూమిని సేకరించినప్పటికీ అభివృద్ధి లేకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.

అమరావతిలో మౌలిక వసతుల కోసం రూ.2 లక్షల కోట్లకు పైగా ఖర్చవుతుందని చెబుతున్నారని, ఇదే సమయంలో కేవలం రెండేళ్లలోనే రూ.3.40 లక్షల కోట్ల అప్పు తీసుకున్నారని ఆయన విమర్శించారు. ఇదే విధంగా పాలన కొనసాగితే రాష్ట్ర అప్పులు రూ.14 లక్షల కోట్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అమరావతి చట్టబద్ధత బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని ప్రకటించిన వైయ‌స్ఆర్‌సీపీ, నిరసనగా రాజ్యసభ నుంచి వాకౌట్ చేసింది.