ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం

9 Jun, 2026 12:45 IST

రాజమహేంద్రవరం: కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో అమలు చేయని హామీలు, ప్రజా సమస్యలపై నిర్వహించనున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్తున్న వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌రామ్‌ను పోలీసులు మంగళవారం ఇంటి వద్దే నిలువరించారు. దీంతో భరత్‌తో పాటు వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నేలపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.  ఈ సందర్భంగా మార్గాని భరత్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యబద్ధంగా తమ నిరసనను తెలియజేసేందుకు నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణమన్నారు. 144 సెక్షన్ అమలులో ఉందనే పేరుతో తమను నిర్బంధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నించడానికి వెళ్తున్న ప్రతిపక్ష నాయకులను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ఎన్నికల సమయంలో ఆడబిడ్డలకు ఏడాదికి రూ.18 వేల ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి వంటి పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు వాటిని అమలు చేయలేదని ఆరోపించారు. 
అలాగే జగనన్న కాలనీలను నిర్వీర్యం చేస్తున్నారని, అక్కడ నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, వాటిని ప్రశ్నిస్తున్న వారిపై ఆంక్షలు విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనిలో ఉందని మండిపడ్డారు. పోలీసులను ఉద్దేశించి మాట్లాడుతూ, ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అధికారంలో ఉన్న వారి ఆదేశాలతో ప్రజాస్వామ్య హక్కులను హరించే చర్యలకు పాల్పడకూడదని సూచించారు.

ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్న ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని, ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదని భరత్ స్పష్టం చేశారు. ప్రజల హక్కులు, ఎన్నికల హామీల అమలు కోసం వైయ‌స్ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. ఈ నిరసన కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.