అమరావతి పేరుతో వేల కోట్ల దోపిడీ జరుగుతోంది
తాడేపల్లి: అమరావతి నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ భారీ అవినీతికి పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ఎస్సీ విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకరబాబు ఆరోపించారు. శనివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీకి పాల్పడుతోందని విమర్శించారు. అమరావతిలో నిర్మాణాల కోసం చదరపు అడుగుకు రూ.20 వేలకుపైగా ఖర్చు చేయడం అవినీతికి పరాకాష్ట అని ఆయన అన్నారు. తెలంగాణ సచివాలయ నిర్మాణానికి అడుగుకు సుమారు రూ.6 వేల ఖర్చు మాత్రమే అయ్యిందని, అలాంటప్పుడు అమరావతిలో మూడు రెట్లకు పైగా వ్యయం చేయడం వెనుక అసలు కారణాలను ప్రభుత్వం ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
ఇప్పటికే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలు ఉండగా మళ్లీ వేల కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మించాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, భవనాల నిర్మాణాల కోసం కేటాయిస్తున్న నిధులను చూస్తే దేశ ఆర్థిక నిపుణులే ఆశ్చర్యపోతున్నారని పేర్కొన్నారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదని, మరోవైపు పెద్దలు మాత్రం భూదోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అమరావతి నిర్మాణం పేరుతో కొత్త టెండర్లు పిలిచి బినామీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని విమర్శించారు.
వైయస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన డీబీటీ విధానం ద్వారా నేరుగా ప్రజలకు లబ్ధి చేకూరిందని, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం మాత్రం “డీపీటీ – దోచుకో, పంచుకో, తినుకో” విధానాన్ని అమలు చేస్తోందని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని స్వప్రయోజనాల కోసం వినియోగించడం చంద్రబాబు పాలనకు నిదర్శనమని అన్నారు. మద్యం, ఇసుక, డీఎస్సీ, భూములు, ప్రాజెక్టులు సహా అన్ని రంగాల్లో అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించిన సుధాకరబాబు, అధికార కూటమి చేస్తున్న అక్రమాలు, ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం వైయస్ఆర్‌సీపీ బాధ్యత అని స్పష్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న ప్రతి నిర్మాణం, ప్రతి ఒప్పందంపై పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేసిన ఆయన, అమరావతి పేరుతో జరుగుతున్న ఖర్చులపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు.