సిద్ధం సభకు వచ్చిన జనాల్లో 10 శాతం కూడా మహానాడులో లేరు
వైయస్ఆర్ జిల్లా: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడులో నిర్వహించిన సిద్ధం సభకు వచ్చిన జనాల్లో 10 శాతం కూడా నిన్నటి టీడీపీ మహానాడుకు రాలేదని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎద్దేవా చేశారు. వైయస్ జగన్ తో టీడీపీ మహానాడు కు వచ్చిన జనాలకు పోటీనా అంటూ హేళన చేశారు. ఒక్కసారికే కడప టీడీపీ అడ్డా అనడం విడ్డూరంగా ఉందన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..`ప్రజాస్వామ్యం ఓడిందని ఏడాది తర్వాత ప్రజలు అంటున్నారు. ఏడాది పాలనలో ఒక్క పథకాన్ని అమలు చేశారా, రాష్ట్ర అభివృద్ధి చేసావా?, ఒక్క పథకాన్ని అయినా అమలు చేసానని నిరూపిస్తావా? . చంద్రబాబు అధికారంలోకి వచ్చాక అన్ని ఛార్జీలు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్నారు. ఏడాది పాలన మొత్తం వెన్నుపోటు, మోసం, కుట్రలు తప్ప ఏం లేదు. ప్రజలకు ఇచిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ప్రజలకు కూటమి ప్రభుత్వం చేసిన అన్యాయాలు, మోసాలను వివరిస్తాం. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమాలకు ప్రజలు స్వచ్ఛందంగా వస్తారు. నిన్న టీడీపీ నేతలు బయటపెట్టి, బెదిరించి మహానాడుకు తరలించారు తప్ప స్వచ్ఛందంగా రాలేదు` అని రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి వ్యాఖ్యానించారు.