బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలి
తిరుపతి : బూత్ స్థాయి నుంచి పార్టీ బలోపేతం చేయాలని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన బూత్ లెవల్ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ స్థాయి ఇంచార్జీలు, పార్టీ సిబ్బంది, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా తిరుపతి, చిత్తూరు జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, “బీఎల్ఓ స్థాయి నుంచి పార్టీని మరింత పటిష్టం చేయాలి. గత రెండేళ్లలో సీఎం చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది” అని అన్నారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత అవసరమని పేర్కొంటూ, “డబుల్ ఓటింగ్ లేకుండా ప్రతి ఓటును కాపాడుకోవాలి. ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ప్రతి సమావేశానికి పార్టీ ప్రతినిధులు హాజరుకావాలి. మన ఓటర్లను, బూత్‌లను రక్షించుకోవడం కీలకం” అని సూచించారు.
మాజీ మంత్రి ఆర్.కే. రోజా మాట్లాడుతూ, “బూత్ స్థాయిలో ప్రతి ఓటరు తన ఓటును సక్రమంగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలి. ఓట్లు డిలీట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. బీఎల్ఓ స్థాయిలో అధికార పార్టీ ఒత్తిళ్లకు లోనవుతున్నారని తెలుస్తోంది” అని ఆరోపించారు.“మన పార్టీ బలంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం. రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో అప్పులు పెరిగాయి. కక్షసాధింపు చర్యలు, డైవర్షన్ రాజకీయాలు ఎక్కువయ్యాయి” అని విమర్శించారు. ఓటర్ల జాబితా పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సూచిస్తూ, “మన ఊరిలో లేని వారు ఎక్కడ ఉన్నారో గుర్తించి తొలగించాలి. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరిని ఓటర్లుగా చేర్చాలి. చనిపోయిన వారు, శాశ్వతంగా వేరే ప్రాంతాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించాలి” అని తెలిపారు. “ఒక బూత్‌లో 1200 ఓట్లు దాటితే కొత్త పోలింగ్ బూత్ ఏర్పాటు చేస్తారు. ఓటర్లకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయాలి. డబుల్ ఓటింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి” అని రోజా అన్నారు.
చిత్తూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జి ఎం.సి విజయానంద రెడ్డి మాట్లాడుతూ, “బూత్ లెవల్, ఎలక్షన్ ఏజెంట్లకు ముందుగానే శిక్షణ ఇవ్వాలి. తద్వారా ఎన్నికల సమయంలో ఇబ్బందులు తగ్గుతాయి” అన్నారు. చిత్తూరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున డబుల్ ఓటింగ్ సమస్య ఉందని పేర్కొంటూ, “సుమారు 15–20 వేల మంది ఓటర్లు బెంగుళూరు, చెన్నైలో స్థిరపడ్డవారే. పక్క రాష్ట్రాల్లో ముందుగా ఓటు వేసి, తర్వాత ఇక్కడ కూడా ఓటు వేస్తున్నారు” అని ఆరోపించారు. “డబుల్ ఓటింగ్ చేసే వారిని గుర్తించి తొలగించాలి. దీనిపై జిల్లా స్థాయిలో ప్రత్యేక మార్గదర్శకాలు ఇవ్వాలి” అని ఆయన సూచించారు.
ఈ సమావేశంలో తిరుపతి ఇంచార్జ్ భూమన అభినయ్ రెడ్డి, పూతలపట్టు ఇంచార్జ్ డాక్టర్ సునీల్, సత్యవేడు ఇంచార్జ్ నూకతోటి రాజేష్, రాష్ట్ర బూత్ కమిటీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మేయర్ డాక్టర్ శిరీష, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షురాలు ముప్పాళ్ల సాయి కుమారి, యోగాంజనేయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.