నాడు-నేడు స్కూల్స్‌పై గ్రామసభల్లో చర్చిద్దామా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014-2019 మధ్య స్కూల్స్ ఎలా ఉన్నాయో, 2019-2024 మధ్య ఎలా ఉన్నాయో పెద్దలతో గ్రామసభలు పెట్టి చర్చిద్దామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మంత్రి లోకేష్‌కు సవాల్ విసిరారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై వైయస్ఆర్‌సీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మండలిలో బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాలలకు దూరమయ్యారనడం సరికాదన్నారు. మంత్రి నారా లోకేష్ కు ఈ లెక్కలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియడం లేదని ఆక్షేపించారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి ఏనాడూ 12 లక్షల మంది విద్యార్ధులు ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు బదిలీ అయిన సందర్భం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు లేవనడం కరెక్ట్ కాదన్నారు. సౌకర్యాల పై సభ్యులందరినీ తీసుకెళ్లి స్టడీ టూర్ పెట్టాలని సలహా ఇచ్చారు. ఒక్కో ప్రభుత్వానికి ఒక్కొక్క విధానం ఉంటుందని, తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రోత్సహించాలన్నదే మా విధానమన్నారు. ప్రాధమిక విద్య నుంచి టోఫెల్ విద్యను నేర్పించడం, ఇంగ్లీష్ మీడియంలో ఐబి విద్యను అందించడం, సెంట్రల్ సిలబస్ (సిబిఎస్) ను అమలు చేసేందుకు నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ చారిత్రాత్మక నిర్ణయాఉ తీసుకున్నారని చెప్పారు. వైయస్ జగన్ కృషితో గతేడాది 80 శాతం మంది విద్యార్ధులు ఇంగ్లీష్ మీడియంలో పరీక్ష రాశారని గుర్తు చేశారు. కిందిస్థాయి నుంచి కమ్యూనికేషన్ కోసం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. సభలో రేపు ఈ సబ్జెక్ట్ మీద చర్చించాలని మేం కోరినట్లు బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ రోజు ఉద్యోగుల సమస్యల పై చర్చించాలని మేం వాయిదా తీర్మానం ఇస్తే తిరస్కరించారని ఆయన వ్యాఖ్యానించారు.