అసత్య ప్రచారాలు ఇకనైనా ఆపాలి
విజయవాడ: తిరుపతి లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేస్తూ కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన కూటమి నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విజయవాడ లబ్బీపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులు విష ప్రచారాలు ఇకనైనా ఆపాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు కోట్లాది మంది ఆరాధ్యదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం గురించి నోటికొచ్చినట్లు మాట్లాడటం అత్యంత అనుచితమని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం వైయస్ఆర్‌సీపీపై బురద జల్లాలనే ఉద్దేశంతో తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని అబద్ధపు ఆరోపణలు చేశారని విమర్శించారు.
రాజకీయాల కోసం దేవుడినే వాడుకునే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని అన్నారు. ఈ ఆరోపణలు పూర్తిగా అసత్యమని సీబీఐ నివేదిక స్పష్టంగా తేల్చినా, కూటమి నేతలు ఇప్పటివరకు బహిరంగ క్షమాపణలు చెప్పకపోవడం మరింత ఆగ్రహానికి దారితీస్తోందన్నారు. కనీసం హిందుత్వంపై నమ్మకం ఉంటే చేసిన తప్పును సరిదిద్దుకోవాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ దుర్గ గుడికి వచ్చి మెట్లు కడిగి భక్తులకు క్షమాపణ చెప్పాలని వ్యాఖ్యానించారు. ఏడాదికిపైగా జంతువుల కొవ్వు కలిసిందంటూ అబద్ధపు ప్రచారాలు చేసి, నిజం బయటపడిన తర్వాత కూటమి నేతలు మొహం చూపించుకోలేక దాక్కొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఎల్లో మీడియా ద్వారా మళ్లీ అసత్య ప్రచారాలు చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ప్రజల ముందుకు వచ్చి క్షమాపణలు చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో భక్తులు స్వయంగా ముందుకు వచ్చి కూటమి నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
వైయస్ జగన్ హయాంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని, మతసామరస్యానికి పెద్దపీట వేసిన ప్రభుత్వం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు అభివృద్ధి పేరుతో అనేక గుడులు కూల్చిన చరిత్ర ఉందని గుర్తు చేస్తూ, హిందువులంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు గౌరవం లేదని తీవ్రంగా విమర్శించారు. ఇలాంటి అసత్య ప్రచారాలు ఇకపై పునరావృతం కాకూడదని, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైయస్ఆర్‌సీపీ నేతలు స్పష్టం చేశారు.