పార్లమెంట్ ఆవరణలో ‘సేవ్ ఆర్డీటీ’ నినాదాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ ప్రాంగణంలో ‘SAVE RDT’ పోస్టల్ కార్డులతో వైయస్ఆర్‌సీపీ ఎంపీలు నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీటీ సంస్థను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు పోస్టల్ కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మేడా మల్లికార్జునరెడ్డి, లోక్‌సభ సభ్యులు గురుమూర్తి, తనుజ రాణి, మాజీ ఎంపీ తలారి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) సంస్థ సేవలను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. దశాబ్దాలుగా పేదల సంక్షేమం, విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి రంగాల్లో ఆర్డీటీ విశేష సేవలు అందిస్తోందని తెలిపారు. అలాంటి సంస్థపై అనవసర ఒత్తిళ్లు తేవడం సరైంది కాదని పేర్కొంటూ, ఆర్డీటీ సంస్థను రక్షించాలనే డిమాండ్‌తో ‘SAVE RDT’ పోస్టల్ కార్డులతో నిరసన తెలుపుతున్నట్లు తెలిపారు. కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని సంస్థకు రక్షణ కల్పించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు కోరారు.