జగనన్న పాలనలో ప్రతి కుటుంబం సంతోషం
కడప: కులమతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా.. అర్హత ఒక్కటే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి కుటుంబం ఆనందంగా ఉందని వైయస్ఆర్ సీపీ ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి అన్నారు. గురువారం తొండూరు మండలంలోని తొండూరు, కోరువానిపల్లె గ్రామాల్లో నిర్వహించిన 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమంలో ఎంపీ వైయస్ అవినాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు, సచివాలయ ఉద్యోగులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ఇంటింటికీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. ఏయే కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎంత సాయం అందిందో అడిగి తెలుసుకున్నారు. ఎవరికీ రూపాయి కూడా లంచం ఇవ్వకుండా.. నేరుగా సంక్షేమ సాయం మా బ్యాంక్ ఖాతాల్లో పడుతుందని, మహిళలంతా సంతోషంగా చెప్పారు. అనంతరం ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఏ గడపకు వెళ్లినా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ పాలన సాగుతోందని చెప్పారు. ప్రజలందరి ఆశీస్సులు తమ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరారు.