ఉపరాష్ట్రపతితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ

26 Aug, 2020 13:39 IST

ఢిల్లీ: వ్యవసాయ ఉత్పత్తులు, ఎగుమతులు పెంచేలా చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్లమెంటరీ స్థాయి సంఘం చైర్మన్‌ విజయసాయిరెడ్డి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును కోరారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఎంపీ విజయసాయిరెడ్డి కలిశారు. వ్యవసాయ, మత్య్స, ప్లాంటేషన్, కొబ్బరి పీచు, పసుపు ఉత్పత్తి ఎగుమతులపై పార్లమెంటరీ స్థాయి సంఘం 154వ నివేదికను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు అందజేశారు. భేటీ అనంతరం ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వ్యవసాయ ఉత్పత్తుల విదేశీ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచాలని, టీ ఉత్పత్తులకు బ్రాండ్‌ ప్రమోషన్‌ చేపట్టాలని ఉపరాష్ట్రపతిని కోరినట్లు వివరించారు. పొగాకు ఉత్పత్తులకు బ్యాలెన్స్‌ పద్ధతి రావాలన్నారు. పొగాకు ఉత్పత్తులను కేవలం ఎగుమతుల వరకే పరిమితం చేయాలని, ఇలా చేయడం వల్ల రైతులకు రైతు కూలీలకు నష్టం జరగదని వివరించారు.