పోలవరం బకాయిలను త్వరలో విడుదల చేస్తాం
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను త్వరలోనే విడుదల చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చినట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన నిధులపై ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ జీరో అవర్‌లో ప్రస్తావించారు. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ జీవనాడి అని, పోలవరం ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తిచేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్రం నుంచి నిధుల కోసం చూడకుండా ప్రభుత్వం సొంతంగాఖర్చు చేస్తోందన్నారు. కేంద్రం నుంచి రూ. 3,805 కోట్లు బకాయిలు రావాల్సి ఉందని, దీనికి సంబంధించి కాగ్ ఆడిట్ కూడా పూర్తయిందని వివరించారు. బకాయిలు విడుదల చేయాలని సీఎం వైయస్ జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారని గుర్తుచేశారు. వెంటనే పోలవరానికి సంబంధించిన బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రితో బకాయిల చెల్లింపులపై చర్చలు జరుపుతున్నామని, వీలైనంత త్వరగా బకాయిలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.