బ్యాంకుల లూటీదారులు, భూకబ్జాదారులు మీవాళ్లేగా బాబూ!
తాడేపల్లి: వైయస్ఆర్ సీపీ అధికారంలోకి వస్తే.. భూములు ఆక్రమిస్తారని చంద్రబాబు దుష్ప్రచారం చేశాడని, బ్యాంకులు లూటీ, విశాఖలో భూములను కబ్జాలు చేసింది ఎవరూ? అని వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన స్పందిస్తూ.. ‘వైయస్ఆర్ సీపీ వస్తే రాయలసీమ రౌడీలు మీ భూములను ఆక్రమిస్తారు. మీ ఇంటి నుంచి మిమ్మల్ని గెంటేస్తారని ఎన్నికలప్పుడు బాబు దిగజారి మరీ దుష్ప్రచారం చేశాడు. బ్యాంకుల నుంచి 8 వేల కోట్లు లూటీ చేసిన రాయపాటి ఎవరు? విశాఖలో వేల కోట్ల విలువైన భూములను కబ్జా చేసిందెవరు? మీవాళ్లేగా బాబూ!’ అని ట్వీట్ చేశారు.
అదే విధంగా ‘ఎ.ఎన్.యూ స్టూడెంట్ రిషితేశ్వరి చనిపోతే విచారణ చేపట్టకపోగా, చంద్రబాబు రిషితేశ్వరి కుటుంబాన్ని బెదిరింపులకు గురిచేశాడు. స్నేహలత విషయంలో సీఎం వైయస్ జగన్ సమగ్ర విచారణకు ఆదేశించటమే కాకుండా ఆ కుటుంబానికి అండగా ఉండి, అన్నివిధాలా ఆదుకునే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంది.’ అని మరో ట్వీట్ చేశారు.