గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకం
అరకు: గిరిజన ప్రాంతాల అభివృద్ధి కేవలం ప్రణాళికలకే పరిమితం కాకుండా, బలమైన పునాదులపై ఆధారపడి ఉండాలని అరుకు పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ తనూజ వినయ్ అన్నారు. గిరిజన సమాజంలో ముఖ్య సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. గిరిజనులకు భూమి, అటవీ హక్కులు కల్పించడం అత్యంత కీలకమని పేర్కొన్నారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి, గిరిజనుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఉపాధి అవకాశాల పెంపు కోసం జీవో నెం.3ను పునరుద్ధరించాలని సూచించారు. స్థానికీకరణ ద్వారా గిరిజన యువతకు 100 శాతం ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.
పాలనా వ్యవస్థలో గ్రామ స్థాయిలో సేవలను బలోపేతం చేయడం కోసం స్థానిక స్వపరిపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని, పేసా చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు మరింత సమర్థవంతంగా అందుతాయని చెప్పారు. విద్యా రంగంలో నాణ్యమైన విద్య అందించేందుకు నాడు-నేడు, అమ్మ ఒడి వంటి కార్యక్రమాలను కొనసాగించాలని, గిరిజన విద్యార్థులకు ఆర్థిక భరోసా కల్పించాలన్నారు. ఆరోగ్య రంగంలో మారుమూల ప్రాంతాల్లో ఇంకా కనిపిస్తున్న ‘డోలీ మోత’ వంటి దయనీయ పరిస్థితులను నిర్మూలించాలని, ప్రాథమిక వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని సూచించారు.
కేవలం కాగితాలపై కాకుండా, క్షేత్ర స్థాయిలో నిజమైన మార్పు తీసుకురావడానికి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని ఎంపీ తనూజ వినయ్ పేర్కొన్నారు.