స్మాల్‌ క్యాన్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్‌ తరలింపు వద్దు

10 Apr, 2026 22:59 IST

న్యూఢిల్లీ:  ఆంధప్రదేశ్‌లోని రాజధాని ప్రాంతమైన తాడేపల్లిలో ఉన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీఎల్‌)కు చెందిన స్మాల్‌ క్యాన్‌ ఫిల్లింగ్‌ (లూబ్రికెంట్‌ ఆయిల్‌ టిన్స్‌) ప్లాంట్‌ను తరలించాలన్న ఆలోచన విరమించాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ డాక్టర్‌ ఎం.గురుమూర్తి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పెట్రోలియమ్, సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హరిదీప్‌సింగ్‌ పూరీకి లేఖ రాసిన ఆయన, ఈ నిర్ణయం వల్ల 200 కుటుంబాలు వీధిన పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. 
    గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉన్న ఐఓసీఎల్‌ స్మాల్‌ క్యాన్‌ ఫిలింగ్‌ ప్లాంట్‌లో చిన్న క్యాన్ల (టిన్స్‌)లో ఇంజన్‌ ఆయిల్‌ (లూబ్రికెంట్‌) నింపి సరఫరా చేస్తారు. వాటిని పెట్రోల్‌ బంక్‌లు, ఇతర ఆటోమొబైల్‌ షాప్‌ల్లో విక్రయిస్తారు. అయితే ఇప్పుడు ఆ ప్లాంట్‌ను చెన్నై యూనిట్‌కు తరలించే విషయాన్ని ఐఓసీఎల్‌ చురుకుగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రికి లేఖ రాసిన వైయస్సార్‌సీపీ ఎంపీ డాక్టర్‌ ఎం.గురుమూర్తి తక్షణమే ఆ ఆలోచన విరమించాలని విజ్ఞప్తి చేశారు. 
    1995లో తాడేపల్లిలో ఏర్పాటైన స్మాల్‌ క్యాన్‌ ఫిల్లింగ్‌ దేశవ్యాప్తంగా ఉన్న 8 యూనిట్లలో ఒకటి కాగా, అది ఈ ప్రాంత అవసరాల్లో 35 శాతం వరకు తీరుస్తోందని ఎంపీ గురుమూర్తి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కర్ణాటకకు కూడా తాడేపల్లి ప్లాంట్‌ లూబ్రికెంట్‌ క్యాన్స్‌ సరఫరా చేస్తోందని, ప్రతి నెలా 3 వేల కిలో లీటర్ల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ పని చేస్తోందని గుర్తు చేశారు. అతి తక్కువ నిర్వహణ వ్యయం, తక్కువ సిబ్బందితో అత్యుత్తమ పనితీరును కనబరుస్తున్న ఈ ప్లాంట్‌ను తరలించాలన్న ఆలోచన ఏ మాత్రం సరికాదన్న ఆయన, వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కోరారు. తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించాలని ఎంపీ గురుమూర్తి ఆ లేఖలో కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేశారు.