‘లడ్డూౖ’పె చర్చంటే భయం దేనికి? 

27 Feb, 2026 19:00 IST

అసెంబ్లీ మీడియా పాయింట్‌:     కల్తీ నెయ్యి ముసుగులో చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడకపోయి ఉంటే, ఇందాపూర్‌–హెరిటేజ్‌ సంబంధంపై చర్చించడానికి కూటమి నాయకులు ఎందుకు భయపడిపోతున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. వెలగపూడిలోని అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద వారు మాట్లాడుతూ నాలుగు రోజులుగా తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతుంటే, ప్రభుత్వం ముందుకు రావడం లేదని ఆక్షేపించారు. ఈ అంశంపై చర్చకు బీఏసీలో అంగీకరించి, తర్వాత సభలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు సీబీఐ సిట్‌ చార్జిషీట్‌తో అడ్డంగా దొరికిపోయాడని, ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ నిధులను తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌ కి దోచిపెట్టాలని చూసినట్టు ఆధారాలు లభ్యం కావడంతో సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి వెళ్లిపోయాడని వైయ‌స్ఆర్‌సీపీఎమ్మెల్సీలు ఆరోపించారు.
    రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలు చేశారని ప్రజలకు తెలిశాక కల్తీ జరిగిందని ఎవరో చెబితే తెలిసింది, పేపర్లో చూసి మాట్లాడామంటూ తప్పించుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ నెయ్యి పేరుతో లడ్డూ వివాదం సృష్టించిన చంద్రబాబు శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. మార్చి 4న జరిగే చర్చలో చంద్రబాబు అవినీతిని, లడ్డూ పేరుతో చేసిన మోసాలను ఎండగడతామని వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏమేం అన్నారంటే..:

చర్చ చేపట్టాలని ధర్నాలు చేసిందే వైయ‌స్ఆర్‌సీపీ: లేళ్ల అప్పిరెడ్డి
– రాజకీయ స్వార్థం కోసం తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా చంద్రబాబు చేసిన ఆరోపణలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు తీవ్రంగా ఖంగిస్తున్నారు. ఎవరైనా ఆరోపణలు చేస్తే, లేదా అనుమానాలు వ్యక్తం చేస్తే నివృత్తి చేయాల్సిన చంద్రబాబే టీటీడీపై తీవ్రమైన ఆరోపణలు చేశాడు. ఆర్థిక ప్రయోజానాలను ఆశించి ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ సొమ్మును హెరిటేజ్‌కి దోచిపెట్టాడు. హెరిటేజ్‌ అవినీతికి సంబంధించి ఆధారాలు బయటకు రావడంతో సమాధానం చెప్పుకోలేక కూటమి పారిపోతోంది. మండలిలో చర్చకు భయపడి పోతోంది. షార్ట్‌ డిస్కషన్‌లో మా సభ్యులు మాట్లాడటం మొదలు పెట్టగానే మంత్రి స్టేట్‌ ఇవ్వడం సభా సాంప్రదాయాలకు విరుద్ధం. మండలి చైర్మన్‌ను  అగౌరవ పరిచేలా అధికార పార్టీ సభ్యులు వ్యవహరించారు. చర్చకు మేం పట్టుబడితే బయట మాత్రం మేం పారిపోతున్నాంటూ తప్పుడు ప్రకటనలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు కూడా మండలిలో మూడు గంటలపాటు నిరసన తెలియజేశాం. కానీ ప్రభుత్వమే ముందుకు రాలేదు. శ్రీవారి ప్రతిష్టను కాపాడటానికి వైయ‌స్ఆర్‌సీపీ ఉద్యమిస్తుంది. 

స్వామివారిని రాజకీయాల్లోకి లాగిందే చంద్రబాబు.
:మొండితోక అరుణ్‌ కుమార్‌ 

– బీఏసీ సమావేశంలో లడ్డూపై చర్చ చేపట్టాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్‌ చేసింది. లడ్డూ గురించి చర్చ జరిగితే హెరిటేజ్‌ అవినీతి బయటకొస్తుందనే భయంతో స్టేట్‌మెంట్‌ ఇచ్చేసి తప్పించుకోవాలనే పన్నాగానికి మంత్రి పయ్యావుల కేశవ్‌ తెరదీశారు. రాజకీయాల కోసం దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిన చంద్రబాబు.. తన కుట్రలు బయటకు రావడంతో సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. చేసిన తప్పుని అంగీకరించి భక్తులకు సమాధానం చెప్పాల్సిందిపోయి మరింత దిగజారి ప్రవర్తించడం రాష్ట్ర ప్రజలంతా చూశారు. సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ సాక్షిగా ఆయన చేసిన మోసాలను ప్రజలు గుర్తించారు. 
 
ప్రతిపక్షం గొంతు నొక్కుతున్నారు: వంకా రవీంద్రనాథ్‌
– మండలిలో ప్రజాస్వామ్య విలువల పతనం జరుగుతోంది. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. దీన్ని వైయ‌స్ఆర్‌సీపీ ఎట్టి పరిస్థితుల్లో సహించే ప్రసక్తే ఉండదు. 

హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టారు: కుంభా రవిబాబు.
– తిరుమల లడ్డూపై తప్పుడు ప్రచారం చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో సీఎం చంద్రబాబు ఆటలాడుకుంటున్నాడు. నెయ్యి కల్తీ పేరుతో చంద్రబాబు చేసిన కుట్రలన్నీ హెరిటేజ్‌ కి టీటీడీ నిధులు దోచిపెట్టడం కోసమేనని తేలిపోయింది. సభ సాక్షిగా ఆధారాలను బయటపెడుతుంటే కూటమి సభ్యులు ఓర్వలేకపోతున్నారు. చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారు. బీఏసీ సమావేశంలో ఒకలా సభలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. సభా సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ప్రభుత్వం భయంతో పారిపోతోంది. శ్రీవారి భక్తులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. 

మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నారు: పి.రామసుబ్బారెడ్డి.
– తిరుమల లడ్డూ వ్యవహారంపై చర్చ జరిగితే వాస్తవాలన్నీ బయటకొస్తాయని ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సీబీఐ సిట్‌ చార్జిషీట్‌ తర్వాత రాజకీయ స్వార్థం కోసం చంద్రబాబు తిరుమల శ్రీవారిని రాజకీయాల్లోకి లాగాడని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కి టీటీడీ నిధులు దోచిపెట్టిన విధానంపైనే ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక చంద్రబాబు కుల మతాల పేరుతో రాజకీయాలు మొదలుపెట్టాడు. స్టేట్‌మెంట్‌ ఇస్తామంటూ మసిపూసి మారేడుగాయ చేయాలని చూస్తున్నారు. ఆలయాలను ప్రక్షాళన చేస్తున్నామంటూ అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నెయ్యి శాంపిల్స్‌ తీసి టెస్టులు చేస్తే, అందులో కల్తీ జరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ మీద నెపం నెడుతున్నారు.  

లడ్డూ వివాదం సృష్టించింది చంద్రబాబే: కవురు శ్రీనివాస్‌.
– తిరుమల లడ్డూ వివాదం సృష్టించి భక్తుల మనోభావాలను దెబ్బ తీసిన చంద్రబాబు భక్తులకు క్షమాపణలు చెప్పాలి. రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేశాడని మేం ఆధారాలతో సహా నిలదీస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పుకోలేక పారిపోతోంది. సభలో చర్చ జరగకుండా కూటమి సభ్యులు అడ్డుపడుతున్నారు. 

మండలిలో చంద్రబాబు మాట్లాడగలరా?: పి.చంద్రశేఖర్‌ రెడ్డి.
– తిరుమల తిరుపతి దేవస్థానం అనేది దేశ ప్రతిష్ట. కలలో కూడా ఎవరూ వినకూడని మాటలతో తిరుమల పవిత్రతను, స్వామి వారి ప్రతిష్టను చంద్రబాబు దిగజార్చాడు. కల్తీ నెయ్యి పేరుతో వైయ‌స్ఆర్‌సీపీ మీద నెపం నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన చంద్రబాబు, సీబీఐ సిట్‌ చార్జిషీట్‌తో అడ్డంగా దొరికిపోయాడు. టీటీడీ తిరస్కరించిన నెయ్యి ట్యాంకర్లు తిరిగి ఎలా ప్రవేశించాయి, వాటిని లడ్డూ తయారీలో ఎలా వాడారో సమాధానం చెప్పుకోవాల్సింది చంద్రబాబే. వారి హయాంలో జరిగిన తప్పులకు బాధ్యత తీసుకోకుండా వైయ‌స్ఆర్‌సీపీ మీద నిందలు మోపడం సిగ్గుచేటు. ప్రభుత్వం చేసిన తప్పులపై నిలదీస్తుంటే సమాధానం చెప్పుకోలేక చర్చకు అడ్డుపడుతున్నారు. నిజాలు బయటకొస్తే ప్రజలు చెప్పులతో కొడతారనే భయం పట్టుకుంది. శాసనసభను టీడీపీ కార్యాలయంగా మార్చేశారు. శాసనసభలో మాట్లాడిన చంద్రబాబు, మండలికి రావడానికి భయపడిపోతున్నాడు. 

సభలో గందరగోళం సృష్టిస్తున్నారు: ఎంవీ రామచంద్రారెడ్డి.
– ఇందాపూర్‌–హెరిటేజ్‌ సంబంధం గురించి ప్రజలకు తెలియాలని పట్టుబడితే సభలో అధికార పార్టీ సభ్యులే చర్చ జరగకుండా అడ్డుపడుతున్నారు. చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌ అవినీతి బాగోతం బయటకు రాకుండా సభలో గందరగోళం సష్టిస్తున్నారు. ప్రతిపక్ష వైయ‌స్ఆర్‌సీపీ మాట్లాడుతుంటే మైకులు కట్‌ చేస్తున్నారు. లడ్డూపై చర్చించాలని ధర్నాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 

అసెంబ్లీలో చంద్రబాబు కట్టుకథలు: బొమ్ము ఇజ్రాయేల్‌
– దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ప్రజలకు క్షమాపణలు చెప్పాలి. సిట్‌ రిపోర్టు తమకు అనుకూలంగా రాలేదనే ఆవేదన చంద్రబాబులో కనిపిస్తోంది. జంతువుల కొవ్వు కలవలేదని చెప్పడంతో బాత్రూమ్‌ క్లీనింగ్‌కి వాడే కెమికల్స్‌ కలిపారని దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు. అసెంబ్లీలో కూడా కట్టుకథలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాడు. చర్చకు వచ్చే ధైర్యం అధికార పార్టీలో లేదు. 

పేపర్లో చూసి మాట్లాడామని ఎలా అంటారు?: సిపాయి సుబ్రహ్మణం.
– పరమ పవిత్రమైన తిరుమల లడ్డూ గురించి చేయకూడని ప్రచారం చేసింది కాకుండా ఆధారాలు బయటపడేసరికి మాట మార్చేస్తున్నారు. ఎవరో చెప్పారు, పేపర్లో వచ్చింది అని అధికారంలో ఉన్నత స్థానంలో ఉన్న నాయకులు మాట్లాడటం తప్పు. చేసిన తప్పుని అంగీకరించి శ్రీవారి భక్తులను క్షమాపణలు కోరాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హిందూ మతాన్ని రాజకీయాల్లోకి లాగి దేవుళ్లను అవమానిస్తున్నారు. మార్చి 4వ తేదీన జరిగే చర్చలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తాం. 

అక్రమాలకు పాల్పడక పోయుంటే భయం దేనికి?: వరుదు కళ్యాణి.
– నెయ్యి కల్తీ పేరుతో ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయుంటే చర్చకు రావడానికి ప్రభుత్వం ఎందుకు భయపడిపోతోంది?  హెరిటేజ్‌ కి ఇందాపూర్‌ కి సంబంధం లేదన్నది నిజమే అయితే ఇందాపూర్‌ పేరెత్తితో ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది?  హెరిటేజ్‌ వెబ్‌సైట్‌లో ఎందుకు మార్పులు చేశారు?  బీఏసీలో చర్చకు అంగీకరించి సభలో మాత్రం అడ్డుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో హిందూ మతానికి జరిగిన ద్రోహం గురించి బయటపెడతామని టీడీపీ భయపడిపోతోంది. 

లఘు చర్చలో స్టేట్‌మెంట్‌ ఏంటి?: కల్పలతా రెడ్డి.
– తిరుమల లడ్డూ వ్యవహారంలో చర్చ జరపాలని వైయ‌స్ఆర్‌సీపీ ఇచ్చిన వాయిదా తీర్మాణాలను ప్రభుత్వం తిరస్కరిస్తూనే ఉంది. అయినా పట్టువదలకుండా పోరాటం చేయడంతో ప్రభుత్వం దిగివచ్చి చర్చకు బీఏసీలో అంగీకరించింది. కానీ సభలో మాత్రం చర్చ జరగకుండా  గందరగోళం సష్టిస్తోంది. లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రభుత్వం ఇప్పటికీ కట్టుబడి ఉందా లేదా సమాధానం చెప్పాలి?   శాసనసభ వ్యవహారాలు చూసే మంత్రి పయ్యావుల కేశవ్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు. లఘు చర్చలో స్టేట్‌ మెంట్‌ ఇవ్వడం అనేది సభాసాంప్రదాయాలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు అవినీతి బయటపడిపోతుందనే భయంతోనే ప్రభుత్వం భయపడిపోతోంది.