హెరిటేజ్-ఇందాపూర్ లింకులు ప్రశ్నిస్తే తప్పా ?
అసెంబ్లీ, వెలగపూడి: హెరిటేజ్ డెయిరీకీ, ఇందాపూర్ డెయిరీకి ఉన్న లింకులపై ప్రశ్నిస్తే ఉలుకెందుకని శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తన వ్యాఖ్యలపై నోటీసులిచ్చి క్షమాపణ అడుగుతున్నారని, మరి లడ్డూ నెయ్యిపై అబద్ధాలు చెప్పి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు చంద్రబాబు కూడా క్షమాపణ ఎందుకు చెప్పరని బొత్స ప్రశ్నించారు. ఇది వ్యక్తిగత విషయం కాదని, ప్రజా సమస్య అని, అందుకే ఏం జరిగిందో ప్రజలకు చెప్పి తీరాలని డిమాండ్ చేశారు. - హెరిటేజ్, ఇందాపూర్ డెయిరీ మధ్య సంబంధాలపై శాసనమండలిలో చర్చకు వైయస్ఆర్‌సీపీ సభ్యుల తీర్మానం. తిరస్కరించిన ఛైర్మన్. అనంతరం సభ వాయిదా తర్వాత మీడియా పాయింట్ వద్ద వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..:
● హెరిటేజ్-ఇందాపూర్ లింక్ పై ప్రశ్నిస్తే నోటీసులా ?: బొత్స సత్యనారాయణ
మండలిలో అజెండా ప్రకారం కార్యకలాపాలు ముందుకు సాగాలి, బడ్జెట్ పై చర్చ జరగాలి. అదే సమయంలో లడ్డూ నెయ్యి సరఫరా చేసిన ఇందాపూర్ డెయిరీ మీద కూడా చర్చ జరగాలి. మా డిమాండ్లపై రాష్ట్ర ప్రజలే నిర్ణయించాలి. హెరిటేజ్ సంస్థ తమకు క్షమాపణలు చెప్పాలని నోటీసులు పంపింది. దేవదేవుడికి ఉన్న కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసిన చంద్రబాబు క్షమాపణలు చెప్పరా ?, నెయ్యిలో జంతుకొవ్వులు కలిశాయని చెప్పిన చంద్రబాబు ఇప్పటివరకూ భక్తులకు క్షమాపణలు చెప్పలేదు. సిట్ రిపోర్ట్ వచ్చిందంటూ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు ప్రెస్ మీట్ పెట్టారుగా?.. ఇప్పుడు జంతు కొవ్వు కలవలేదు కాబట్టి అలాగే ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు అడగండి. నేను మాట్లాడేది వాస్తవం. ఈ రోజుకీ నేను మాట్లాడిన మాటలకు కట్టుబడి ఉన్నాను. ఇది వ్యక్తిగతం కాదు. ప్రజా సమస్య. ప్రజలకు ఏం జరిగిందో వాస్తవాలు తెలియాలి. అందుకే మండలిలో దీనిపై చర్చ జరగాలని కోరుకుంటున్నాం.
హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్ మీద ఇందాపూర్ డెయిరీ పేరు కనిపిస్తుందనే నేను చెప్పాను. ఇందులో తప్పేముంది ? కూటమి నాయకులు ఎంత సేపూ డబ్బు గురించే మాట్లాడతారు, కానీ మేం లడ్డూకు ఉన్న పవిత్రత, కోట్లాది ప్రజలకు ఉన్న భక్తి, దాన్ని మీరు ఎలా దెబ్బతీసారన్నదే మాట్లాడుతున్నాం. మాకు హెరిటేజ్ షేర్ రేట్లు, వ్యాపారాలతో సంబంధం లేదు. ఈ ఎన్నికలకు ముందు రూ. 250-300 ఉన్న షేర్ ధర ఎన్నికల తర్వాత రూ.700కు పెరిగింది. దీనికి అవార్డులు ఇచ్చారా లేదా అన్నది మాకు అనవసరం అని స్పష్టం చేశారు.
● మొండితోక అరుణ్ కుమార్, ఎమ్మెల్సీ
ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ విషయంలో మేం రెండు విషయాలు అడుగుతున్నాం. ఒకటి శ్రీవారి లడ్డూ కల్తీ అంటూ చంద్రబాబు చేసిన ప్రకటనలు, మాటలకు ముందుగా క్షమాపణలు చెప్పాలి. భక్తుల మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణలు చెప్పాల్సిందే. రెండవది కల్తీ నెయ్యి సరఫరా విషయంలో హెరిటేజ్ కూ, ఇందాపూర్ డెయిరీకి ఉన్న సంబంధంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. టీడీపీ హయాంలో ఈ అంశంపై జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరగాలి. రాష్ట్ర కేబినెట్ హెరిటేజ్ ఫుడ్స్ కు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ద్వారా రూ.300 కోట్లు రాయితీగా ప్రకటించింది. 35 మందికి ఉపాధి కల్పించే హెరిటేజ్ ఫుడ్స్ కు రూ.295 రాయితీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. లేకపోతే వైయస్ఆర్‌సీపీ తరఫున పోరాటాలు తప్పవని హెచ్చరించారు.
● వంకా రవీంద్రనాథ్, ఎమ్మెల్సీ
ప్రజా సమస్యలు ప్రస్తావించాలి, బడ్జెట్ మీద ప్రజల అభిప్రాయాలు చెప్పాలని మండలికి వెళ్తే ఇవాళ కూడా నిరాశే మిగిలింది. ప్రభుత్వం సహకరించపోవడం వల్ల సభ ముందుకు సాగలేదు. ఆవులు, పశువుల అక్రమ రవాణా జరుగుతోందని ప్రశ్నిస్తే.. అవును, కేసులు పెట్టాం, ప్రత్యేక పహారా పెట్టామని హోంమంత్రి చెప్తున్నారు. కానీ అదంతా అబద్ధమే. క్షేత్రస్ధాయిలో జరుగుతోంది వేరు. వీటి అక్రమ రవాణాపై ఎలాంటి నియంత్రణ లేదు. మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్ లేకుండా మూగజీవాల అక్రమ రవాణా సాగిపోతోంది. ఒక్క ఆర్టీవో కూడా వాహనాల్ని అడ్డుకుని కేసు పెట్టడం లేదు. ఇలా రవాణా చేయాల్సినప్పుడు ముందురోజు వెటర్నరీ డాక్టర్ ఇది పాలివ్వడం లేదు, పనికిరాదని సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో బ్రాహ్మణులకు ఇలాంటి ఆవుల్ని దానం చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క ఆవు కూడా కనిపించడం లేదు. పశ్చిమగోదావరి జిల్లా తేతలిలో లేహం ఫుడ్ ప్రొడక్ట్స్ అనే పరిశ్రమ ఎన్నో అక్రమాలకు పాల్పడుతోంది. దీనిపై ప్రజలు నిరసనలకు దిగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోగా బాధితులపైనే ఎదురుకేసులు పెడుతోంది. బీఫ్ ఎగుమతుల్లో ఆవుమాంసం శకలాలు ఉన్నాయని వైజాగ్ లో కేసు నమోదైంది. ఇది తణుకు నుంచి ఎగుమతి అయిన మాంసంపైనే అనే అనుమానాలున్నాయి. పోలీసు, పశుసంవర్ధక, రవాణాశాఖలు ఉమ్మడిగా పనిచేస్తేనే దీనికి అడ్డుకట్ట పడుతుందని స్పష్టం చేశారు.