విద్యుత్ ఛార్జీలపై ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి

అమరావతి: ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచమని చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వై. శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు పై ఆయన మాట్లాడారు. ఎన్నికల సమయంలో విద్యుత్ ఛార్జీలు పెంచబోమని చెప్పి అధికారంలోకి వచ్చాక యూనిట్‌పై 2 రూపాయలు భారం వేశారని మండిపడ్డారు. సర్దుబాటు ఛార్జీల పేరుతో 15 వేల కోట్ల రూపాయలు భారం వేశారని ధ్వజమెత్తారు. గత టిడిపి ప్రభుత్వం 20 వేల కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం చెల్లించిందని గుర్తు చేశారు. 2014 నుంచి 19 వరకూ 13 వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తే .. 2019 నుంచి 2024 వరకూ 47 వేల కోట్ల రూపాయల సబ్సిడీ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం భరించిందన్నారు. రేట్లు పెంచకుండా ట్రూ అప్ చార్జీలను ప్రభుత్వమే భరిస్తుందని, ఉన్నదానిని తగ్గిస్తామని మాటిచ్చిన చంద్రబాబు దానిని నిలబెట్టుకోవాలని శివరామిరెడ్డి సూచించారు.