అమరావతి తీర్మానం పేరుతో  ‘డైవర్షన్ పాలిటిక్స్’

30 Mar, 2026 15:06 IST

నంద్యాల:  రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త పేరుతో అమరావతి అంశాన్ని తెర‌పైకి తీసుకువ‌చ్చి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం  ‘డైవర్షన్ పాలిటిక్స్’ చేస్తుంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మండిప‌డ్డారు. శాస‌న మండ‌లిని విస్మ‌రించి ఒక్క‌ అసెంబ్లీలో మాత్ర‌మే రాజధాని తీర్మానం ప్రవేశ‌పెట్ట‌డాన్ని ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  నంద్యాల ప‌ట్ట‌ణంలోని వైయ‌స్ఆర్‌సీపీ  జిల్లా కార్యాల‌యంలో ఎమ్మెల్సీ ఇసాక్ బాషా  మీడియాతో మాట్లాడుతూ, అమరావతిపై ప్రభుత్వం తీసుకొచ్చిన తాజా తీర్మానం చర్చనీయాంశంగా మారిందన్నారు. అధికారంలో ఉండి ఎవరూ అడ్డుకోని పరిస్థితిలో కూడా తీర్మానాల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వ‌జ‌మెత్తారు.

2028 గడువు విధిస్తూ, అదే సమయంలో “రాజధానిని మార్చేస్తారు” అనే ప్రచారం చేయడం ద్వారా కూటమి ప్రభుత్వానికే తమపై నమ్మకం లేదని స్పష్టమవుతోందన్నారు. రాజధాని నిర్మాణానికి మొదటి దశకే లక్ష కోట్లకు పైగా, రెండో దశకు మరో 50 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారని, మొత్తంగా రూ.2 లక్షల కోట్ల భారం రాష్ట్రం మోయగలదా అని ప్రశ్నించారు. టెండర్లలో పారదర్శకత లేదని, స్క్వేర్ ఫీట్‌కు రూ.11 వేల వరకు ఖర్చు చూపడం వెనుక మతలబు ఏమిటని నిలదీశారు. 4% ఎక్సెస్‌తో అనుచరులకు కాంట్రాక్టులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని అన్నారు. అమరావతిలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ప్లాట్లు ఎక్కడున్నాయో తెలియని స్థితి, రోడ్లు లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని విమర్శించారు. సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతూనే రూ.47 వేల కోట్ల అప్పులు చేయడం, రూ.5 వేల కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లుగా ఇవ్వడం అనుమానాస్పదమని పేర్కొన్నారు.

అమరావతి నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా మారుతుందా? లేక అవినీతికి అడ్డాగా మారుతుందా? అన్నది ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ వెనుక అసలు ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైయ‌స్ఆర్‌సీపీ కౌన్సిల్ సభ్యులు గోపవరం సాయినాథ్ రెడ్డి, రామలింగారెడ్డి, రాష్ట్ర అగ్రికల్చర్ జాయింట్ సెక్రటరీ రత్నబాబు చౌదరి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి శశికళ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాభూన్నిసా, జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, అధికార ప్రతినిధి అనిల్ అమృతరాజ్, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు రామసుబ్బయ్య, మేధావుల సంఘం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, జిల్లా కార్యదర్శులు దేవనగర్ బాషా, శివ నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.