మెజార్టీ కార్పొరేటర్లు వైయస్ఆర్‌సీపీతోనే ఉన్నారు
విశాఖపట్నం: కూటమి నేతలు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మెజార్టీ కార్పొరేటర్లు వైయస్ఆర్‌సీపీతోనే ఉన్నారని శాసన మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించడం కరెక్ట్ కాదని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదని హితవు పలికారు. విశాఖలో వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లతో గురువారం బొత్స సత్యనారాయణ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కశ్మీర్‌లో తీవ్రవాదుల కాల్పులు కారణంగా 26 మంది చనిపోవడం బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు చనిపోవడం దురదృష్టకరం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ల ఆర్థిక మూలాల మీద దెబ్బ కొడతామని కూటమి నేతలు బెదిరించారు. నేనెప్పుడూ ఇటువంటి రాజకీయాలను చూడలేదు. రాజకీయాల్లో ఇటువంటి సాంప్రదాయం మంచిది కాదు. వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్ల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 11 నెలల మేయర్ పదవి కోసం అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఈ 11 నెలల కాలంలో ఏం చేస్తారో ప్రజలకు చెబుదాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మెజార్టీ కార్పొరేటర్లు వైయస్ఆర్‌సీపీతోనే ఉన్నారు. వారందరినీ అభినందిస్తున్నాను అంటూ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.