విద్వేషాలు రెచ్చగొట్టేందుకే గొల్లపూడికి చంద్రబాబు

31 Jul, 2021 13:09 IST

విజయవాడ: దేవినేని ఉమా స్వాతంత్య్ర సమరయోధుడు అని పలకరించడానికి వచ్చావా..? అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ చంద్రబాబును ప్రశ్నించారు. విద్వేషాలు రెచ్చగొట్టేందుకు, శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు చంద్రబాబు గొల్లపూడికి వచ్చారని మండిపడ్డారు. దేవినేని ఉమా చెప్పిన అబద్ధాలను నిజం చేయడానికి చంద్రబాబు నిజనిర్ధారణ కమిటీ వేశారని, మైలవరంలో జరుగుతున్న అంశం గురించి చంద్రబాబుకు కొంతైనా అవగాహన ఉందా అని ప్రశ్నించారు. విజయవాడలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 

దేవినేని ఉమా 8 గంటలు కారులో కూర్చొని నాకు రెండుసార్లు ఫోన్‌ చేశాడని చంద్రబాబు చెబుతున్నాడని, కారులో కూర్చోవడం ఎందుకు కంప్లయింట్‌ ఇచ్చి ఇంటికి వెళ్లిపో అని ఉమాకు ఎందుకు చెప్పలేకపోయావని ప్రశ్నించారు. కారులో కూర్చొని డ్రామాలు ఆడు ఎల్లో మీడియాతో ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయిస్తానని చెప్పావా..? అని నిలదీశారు. 

దేవినేని ఉమా చెప్పిన అబద్ధాలను నిజం చేయాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారని, అందుకే నిజనిర్ధారణ కమిటీ అనే బూటకపు కమిటీని వేశారన్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి అలజడులు లేవని మాట్లాడిన చంద్రబాబుకు 2004లో వసంత నాగేశ్వరరావు కారును ధ్వంసం చేసిన ఘటన గుర్తులేదా..? అని నిలదీశారు. 2018 టీడీపీ హయాంలో అప్పటి రెవెన్యూ మంత్రి స్టే ఇచ్చింది వాస్తవం కాదా..? దేవినేని ఉమా ఇప్పించింది వాస్తవం కాదా..? 143 సర్వే నంబర్‌లో క్రషర్‌ ప్రారంభోత్సవం దేవినేని ఉమా చేసింది వాస్తవం కాదా..? ఇవన్నీ చెప్పకుండా నిజనిర్ధారణ కమిటీ ఏంటీ..? 

దేవినేని ఉమా తప్పు చేశాడన్న విషయం చంద్రబాబుకు కూడా తెలుసని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ అన్నారు. శాటిలైట్‌ పిక్చర్‌తో వాస్తవాలు తెలుస్తాయి. వాటిని బయటకు తీయాలని ప్రభుత్వాన్ని కోరారు. కొండపల్లి అడవిలో చంద్రబాబుకు ఏం తెలుసు..? అని ప్రశ్నించారు. రెండు సంవత్సరాల నుంచి సీఎం వైయస్‌ జగన్‌పై దేవినేని ఉమా చేస్తున్న దుష్ప్రచారాలకు ప్రజలు విసిగిపోయి తిరగబడ్డారని, చంద్రబాబు తీరు కూడా మార్చుకోకపోతే టీడీపీకి ఉన్న 23 సీట్లు కాస్త 2 సీట్లకే పరిమితమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. లేనిపోని ఆరోపణలు చేసి.. దేవినేని ఉమా చెప్పిన అబద్ధాలను తనపై, ప్రభుత్వంపై రుద్ధడానికి ప్రయత్నించినందుకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.