సభాపతిగా ప్రతిపాదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

7 Jun, 2019 15:28 IST

 

తాడేపల్లి: విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండవ శాసన సభాపతిగా తనను నియమించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరుచుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా అసెంబ్లీ సమావేశాలను హుందాగా నడిపిస్తానని వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం వైయస్‌ఆర్‌ఎల్పీ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో భేటీ అయ్యారు. స్పీకర్‌గా తనను ప్రతిపాదిస్తున్నట్లుగా ముఖ్యమంత్రి చెప్పారని, సీఎం ఏ బాధ్యత అప్పగించినా త్రికరణ శుద్ధితో నిర్వర్తిస్తానని సీతారాం అన్నారు. తనపై అపారమైన నమ్మకం ఉంచి సభాపతిగా ప్రతిపాదించినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తనకంటే ముందు ఎంతోమంది స్పీకర్‌లుగా వ్యవహరించి మంచి సంప్రదాయాలను నెలకొల్పారన్నారు. అవే ఈ రోజుకీ మార్గదర్శకాలుగా ఉన్నాయన్నారు.
 
ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మొట్టమొదటి నుంచి బీసీలపై ప్రేమతో, వారిని ప్రోత్సహించాలనే ఆలోచనతో ఉన్నారని ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం అన్నారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా, వెనుకబడిన కళింగ వర్గానికి చెందిన తనకు స్పీకర్‌గా అవకాశం ఇచ్చినందుకు వెనుకబడిన వర్గాల తరుఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అధికార, ప్రతిపక్ష సభ్యులను సమన్వయపరుచుకుంటూ సమస్యల పరిష్కారం దిశగా సభను హుందాగా నడిపిస్తాను.