మాకు రాజకీయ దార్శనికత ఉంది.. భావ దారిద్ర్యం కాదు

27 Jan, 2026 15:01 IST

ప్ర‌కాశం జిల్లా:  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ య‌ర్ర‌గొండ‌పాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ హోం మంత్రి అనితకి కౌంట‌ర్ ఇచ్చారు. “బెంగుళూరు అంకుల్” అంటూ హోం మంత్రి అనిత  చేసిన జూగుప్సకరమైన వ్యాఖ్యలు చూస్తే, కూటమి ప్రభుత్వానికి ఉన్న రాజకీయ భావ దారిద్ర్యం ఏంటో స్పష్టంగా అర్థమవుతోందని ఆయన త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు.  సైద్ధాంతిక వాదనలు, విధాన పరమైన చర్చలు పక్కనపెట్టి వికృతమైన రాజకీయ వ్యాఖ్యలకు దిగజారడం ద్వారా హోం మంత్రి స్థాయి రోజురోజుకీ పడిపోతోందని తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. విధానాలపై వాదనలు చేయాల్సిన స్థాయిలో ఉండి వ్యక్తిగత దూషణలకు పాల్పడటం కూటమి పాలన దిశారాహిత్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇవ్వాలన్నది వైయస్ జగన్ గారి రాజకీయ దార్శనికతలో భాగమని, ఆ విధానాన్ని మార్చలేకనే చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా అనిత గారికి పదవి ఇచ్చారని తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఈ నిజాన్ని హోం మంత్రి ముందుగా అర్థం చేసుకోవాలని సూచించారు. 

మాకు సాధ్య‌మే..కానీ
“హైదరాబాద్ ఆటగాడు”, “పిఠాపురం పాటగాడు” వంటి వ్యాఖ్యలు చేయడం వైయస్ఆర్‌సీపీకి కూడా సాధ్యమేనని, కానీ ఆ స్థాయికి దిగజారే రాజకీయ సంస్కృతి తమది కాదని స్పష్టం చేశారు. తమకు రాజకీయ దార్శనికత ఉందని, భావ దారిద్ర్యం లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. ఇప్పటికే ‘వర్క్ ఫ్రమ్ హోం’ శాఖగా హోం శాఖను పూర్తిగా నిర్వీర్యం చేశారని విమర్శించారు. ప్రజల భద్రత, చట్టసంరక్షణ బాధ్యతలను గాలికొదిలేసి, అహంకారం, అవగాహనలేమితో వ్యవహరించడం దళిత ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు. ఇకనైనా హోం మంత్రి అనిత  దిగజారిన వ్యాఖ్యలు మానేసి, సుసంగతమైన, గుణప్రదమైన రాజకీయాలకు అలవాటు పడాలని తాటిపర్తి చంద్రశేఖర్ హితవు పలికారు. అజ్ఞానం, అహంకారం, అవగాహనలేమికి హోమియోపతిలో అయినా చికిత్స దొరకాలని ఆశిస్తున్నానని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.