రాజకీయాల కోసం ఇంతదిగజారిపోతారా?
కర్నూలు: ‘రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్‌పై టీడీపీ నేత పట్టాభి చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వైయస్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల కోసం ఇంత దిగజారిపోతారా అని మండిపడ్డారు. కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో రెండో రోజు జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ దీక్షా శిబిరంలో ఎమ్మెల్యే పాల్గొని చంద్రబాబు తీరును ఎండగట్టారు. ప్రజాస్వామ్యంలో దేవాలయం వంటి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారని చంద్రబాబు అంటున్నారు. నేనొక్కటే అడుగుతున్నా.. మీరు ఈ రెండేళ్లులో ఎప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారా? మీ పార్టీ కార్యాలయం ప్రజాస్వామ్య కార్యాక్రమాలకు వేదికగా నిలిచిందా? అని ప్రశ్నించారు. కేవలం కుట్రలు, కుతంత్రాలు చేయడానికే అది నిలయంగా మారింది’’ అని ఎమ్మెల్యే ధ్వజమెత్తారు.
తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయిందని, ఆ పార్టీ గురించి ప్రజలు ఆలోచించే పరిస్థితి లేదన్నారు. అందుకే నిత్యం ఏదో ఒక విధంగా కుట్రలు చేస్తూ చంద్రబాబు ముందుకు సాగుతున్నారన్నారు. కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో టీడీపీ వంటి పార్టీకి స్థానం లేకుండా చేయాలన్నారు. రాజకీయ ఉనికి కోసం సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారా? 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఇంతగా దిగజారుతారా? అని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు కూడా పట్టాభి వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. చంద్రబాబు 36 గంటల దీక్ష దేనికోసమో అర్థం కావడం లేదన్నారు. ఎన్ని దొంగ దీక్షలు చేసినా, కుటిల ప్రయత్నాలు చేసినా ప్రజలు చంద్రబాబును, టీడీపీని నమ్మే పరిస్థితి లేదన్నారు.ఈ రోజు సాయంత్రం లోగా చంద్రబాబు నాయుడు సీఎం వైయస్ జగన్‌కు, వైయస్ఆర్‌సీపీకి, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శిల్పా హెచ్చరించారు.