కుప్పం దెబ్బకి బాబుకు పిచ్చెక్కింది
అసెంబ్లీ: కుప్పం మున్సిపాలిటీ ఫలితాల దెబ్బకి చంద్రబాబుకు పిచ్చెక్కిందని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. భారీ వర్షాలు, వరదలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో సమీక్షలు చేపడుతూ, ప్రజలకు ఎలాంటి సాయం కావాలన్నా వెంటనే అందేలా ఉండాలని అధికారులను సీఎం వైయస్ జగన్ అప్రమత్తం చేస్తున్నారన్నారు. పునరావాసం, సహాయ చర్యలు, పరిహారం, రైతులను ఆదుకోవడం వంటి అంశాలపై ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారన్నారు. ఏరియల్ సర్వే గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగా ఏరియల్ సర్వే పేరుతో టిఫిన్లు చేసుకుంటూ, పేపర్ చదువుకుంటూ కాలక్షేపం చేయలేదా అని ప్రశ్నించారు. వరద బాధితుల వద్దకు వెళ్లిన చంద్రబాబు.. వారికి ధైర్యం చెప్పాల్సిందిపోయి.. అక్కడ కూడా నీచ రాజకీయాలు చేస్తున్నాడని, చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడని ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. వరదలు మానవ తప్పిదం వల్లే అని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని, పబ్లిసిటీ పిచ్చితో గోదావరి పుష్కరాల్లో 29 మందిని పొట్టనబెట్టుకోవడం మానవ తప్పిదమని, వాస్తవాలు బయటకు రాకుండా సీసీ ఫుటేజ్ డిలీట్ చేయించాడని ఎమ్మెల్యే ఆర్కే రోజా ధ్వజమెత్తారు.