సంక్షేమ పథకాలతో ప్రతి కుటుంబానికి మేలు
మైదుకూరు: ప్రజా సంక్షేమం, పరిపాలనలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ 4వ సచివాలయం పరిధిలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకూ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆరా తీశారు. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందిన సాయాన్ని అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పాటిస్తున్నామని, ప్రభుత్వ పథకాలతో ప్రతీ కుటుంబం సంతోషంగా ఉందన్నారు. గడప గడపకూ వెళ్తున్నప్పుడు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ఒక్కో కుటుంబం లక్షల్లో లబ్ధిపొందామని చెబుతున్నారన్నారు. సీఎం వైయస్ జగన్ నాయకత్వాన్ని ప్రజలంతా మెచ్చుకుంటున్నారని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఉన్నారు.