ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ దేశానికే రోల్‌ మోడల్‌

13 Jun, 2019 12:43 IST

వెలగపూడి: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం అవకాశాలు కల్పించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అన్నారు. స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనా తమ్మినేని సీతారాంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి సభలో మాట్లాడుతూ.. స్వాతంత్ర వచ్చిన తరువాత ఉమ్మడి ఆంధ్రరాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎన్నికల వేళ అనేక రకాలుగా పొగడడం, అధికారంలోకి వస్తే అన్ని రకాలుగా ప్రాధాన్యం ఇస్తామని చెప్పి విస్మరించడం గత చరిత్ర. కానీ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గత చరిత్రకు భిన్నంగా స్వతంత్ర భారత చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా ఇవ్వని అవకాశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం ఇచ్చి దేశానికే రోల్‌ మోడల్‌ ముఖ్యమంత్రిగా మారారన్నారు. స్పీకర్‌ వ్యవస్థ దిగజారుతుందని సభ్యులు అంటున్నారు.. అందుకు కారణం స్పీకర్‌గా ఉన్న వ్యక్తి పాత్ర తక్కువ అయితే అప్పటి ముఖ్యమంత్రుల పాత్రే ఎక్కువ అన్నారు. స్పీకర్‌ అనే వ్యక్తి నిస్పక్షపాతంగా వ్యవహరించకుండా ఏకపక్షంగా వ్యవహరించడం అది ముఖ్యమంత్రుల ప్రోద్బలం. అయితే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ సభలో మాట్లాడిన మాటలు 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే వ్యక్తులు గుర్తుంచుకోవాలన్నారు. సంఖ్యాబలం మాకు ఉందని ఇష్టారాజ్యంగా వ్యవహరించం.. స్పీకర్‌గా మీకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నాం.. సభను గౌరవంగా నడపండి సభ్యులందరికీ అవకాశాలు ఇవ్వండి అని సీఎం వైయస్‌ జగన్‌ చెప్పారన్నారు. సభను స్వేచ్ఛగా, సంప్రదాయంతో నడపాలని కోరుకుంటున్నానన్నారు.