గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రీకౌంటింగ్ చేయాల్సిందే..
అసెంబ్లీ: పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక రీకౌంటింగ్ చేయాల్సిందేనని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికల కమిషనర్ ఆదేశాలను రిటర్నింగ్ ఆఫీసర్ గౌరవించలేదన్నారు. 8వ రౌండ్‌లో 19వ టేబుల్ వద్ద ఒక బండిల్‌లో తేడా గుర్తించామని, వైయస్‌ఆర్ సీపీ అభ్యర్థి ఓట్లు టీడీపీకి వెళ్లాయన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. రిటర్నింగ్ ఆఫీసర్ తప్పిదంతో కౌంటింగ్‌లో తేడా జరిగిందని తేలిందన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్‌తో చంద్రబాబు 8సార్లు ఫోన్‌లో మాట్లాడారని చెప్పారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలను గుర్తించి వెంటనే రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. చివరలో రీకౌంటింగ్ చేస్తామని రిటర్నింగ్ అధికారి రాతపూర్వకంగా తమకు హామీ ఇవ్వడంతో ఓట్ల లెక్కింపు మొత్తం పూర్తి అయ్యేవరకూ ఎదురుచూశామన్నారు. ఎక్కువ మంది క్యాండిడేట్ లు ఉండటంతో ఓట్ల లెక్కింపులో అక్కడక్కడ పొరపాట్లు జరిగి ఉండచ్చు అని కూడా రిటర్నింగ్ అధికారి ఒప్పుకున్నారన్నారు. ఇలాంటి పొరపాట్లు ఎన్ని జరిగి ఉంటాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.