చంద్రబాబుకు శాశ్వత రాజకీయ క్వారంటైన్ తప్పదు
తాడేపల్లి: కరోనా వైరస్ నివారణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న సీఎం వైయస్ జగన్ ప్రభుత్వంపై హైదరాబాద్‌లో కూర్చొని విమర్శలు చేస్తున్న చంద్రబాబుకు శాశ్వత రాజకీయ క్వారంటైన్ తప్పదని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. నోట్లో వేలుపెడితే కొరకలేనట్లుగా చంద్రబాబు సూక్తులు చెబుతున్నాడని మండిపడ్డారు. కరోనాను కట్టడి చేయడంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ రెండు అడుగులు ముందే ఉందన్నారు. మిగిలిన రాష్ట్రాల సీఎంలు కూడా ముఖ్యమంత్రి వైయస్ జగన్ బాటలో నడుస్తున్నారని, మన ముఖ్యమంత్రి ఆలోచన ధోరణిని కేంద్రం సైతం మెచ్చుకుంటుందని వివరించారు.
తాడేపల్లిలోని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే జోగి రమేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే.. "కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రంలో ప్రధాని మోడీ, రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించాలని సీఎం వైయస్ జగన్ ప్రతి రోజు సమీక్ష చేస్తూ ప్రభుత్వ, అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తూ స్వీయం నియంత్రణ, భౌతికదూరం పాటించాలని ఆదేశాలు ఇస్తున్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకంటే చిన్న వయస్సు ఉన్నా అందరికంటే మిన్నగా సీఎం వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారు. ఎవరికి రాని ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. కరోనా మహమ్మారిని పారదోలే క్రమంలో టెస్టింగ్ కిట్లు కావాలని సీఎం వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధానిని అడితే.. కొరత ఉంది.. మీ ప్రయత్నాలు మీరు చేయండి అని ప్రధాని చెబితే.. దక్షిణ కొరియా నుంచి మన రాష్ట్రానికి లక్ష కిట్లను దిగుమతి చేసుకున్నాం. మిగిలిన రాష్ట్రాల సీఎంలు వైయస్ జగన్ బాటలో ముందుకు వెళ్తున్నారు.
బాధ్యత కలిగిన ప్రతిపక్షం దిగజారి ప్రవర్తిస్తోంది. ప్రతిపక్షనేత దిగజారి మాట్లాడుతున్నాడు. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే రాష్ట్ర ప్రభుత్వం టెస్టింగ్ కిట్లను కొనుగోలు చేసింది. ర్యాపిడ్ కిట్లను కేంద్రం కూడా కొనుగోలు చేసింది. కేంద్రం కూడా తప్పు చేసినట్లేనా..? దౌర్భాగ్యులు చంద్రబాబు, కన్నాలక్ష్మీనారాయణ సమాధానం చెప్పాలి.
సీఎం వైయస్ జగన్ ఆలోచన ధోరణిని అందరూ మెచ్చుకుంటున్నారు. కరోనాను ఎదుర్కొవడంలో మనం ముందు వరుసలో ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అభినందించకపోయినా పర్వాలేదు.. కానీ, రాళ్లేయడం ఏంటీ? హైదరాబాద్‌లో కూర్చొని గోర్లు గిల్లుకో, లేకపోతే కొడుకుకు సోది కబుర్లు చెప్పుకో, మనవడితో ఆడుకో అంతేగానీ కరోనాపై పోరాడుతున్న రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయొద్దు చంద్రబాబూ..
చంద్రబాబు బుద్ధి ఎలా ఉందంటే.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదు.. కరోనా కట్టడి చేయకూడదు. కరోనా మహమ్మారి పెరిగిపోవాలి.. ప్రజలంతా చనిపోయవాలని హైదరాబాద్‌లో కూర్చొని పైశాచిక ఆనందానికి ఒడిగడుతున్నాడు. ఇటువంటి రోత ప్రతిపక్ష నాయకుడు మనకు అవసరమా..?" అని ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు.