మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సంక్షేమ పథకాల అమలు

17 Oct, 2022 12:24 IST

నంద్యాల: అన్నదాతకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ, ప్రతీ విషయంలో వారిని చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్‌ రైతు భరోసా సాయం విడుదల చేసేందుకు ఆళ్లగడ్డకు వచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రైతు భరోసా పథకం అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వరుసగా నాలుగో ఏడాది రెండో విడత రైతు భరోసా పథకం అమలు బహిరంగ సభలో ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. 

‘‘రెతు భరోసా పథకం అన్నదాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. పంట పెట్టుబడి సమయాల్లో రైతులు ఇబ్బంది పడకూడదు, ఎవ్వరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండొద్దు.. అప్పులపాలు కాకూడదనే గొప్ప ఆలోచనతో వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారు. అకాల వర్షాలతో పంటనష్టం జరిగితే అదే సీజన్‌లో రైతుల అకౌంట్లలోనే పరిహారం అందజేయడం జరుగుతుంది. గతంలో ఎప్పుడూ, ఎక్కడా లేని విధంగా రైతన్నకు అండగా సీఎం వైయస్‌ జగన్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారు. పంటకు గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వమే నిర్ణయించి, ఆ పంటలను మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసి చెల్లించాల్సిన డబ్బు కూడా 45 రోజుల్లోపు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామంటే సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. 

ప్రతీ ఒక్క కార్యక్రమాన్ని, అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమాన్ని ఎన్ని అడ్డంకులు, కష్టాలు ఎదురైనా, ఎంతమంది అవాకులుచవాకులు పేలుతున్నా.. వాటిని లెక్కచేయకుండా ఇచ్చినమాటకు కట్టుబడి మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ప్రతీ కార్యక్రమాన్ని చెప్పిన రోజు అమలు చేస్తూ లబ్ధిదారుల అకౌంట్లలో నగదు డిపాజిట్‌ చేయగలుగుతున్నారంటే అది కేవలం ప్రజల ఆశీర్వాదం, సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వ పటిమ వల్లే.  

ఆళ్లగడ్డకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలిగాం. ఆళ్లగడ్డ అడ్డా, కోట అని చెప్పుకునేవారు ఒక్క కార్యక్రమం కూడా చేసిన పాపానపోలేదు. ఇన్నేళ్లుగా ఆళ్లగడ్డకు ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేకపోయారు. పులివెందుల తరువాత ఆళ్లగడ్డకు డిగ్రీ కాలేజీ మంజూరు చేశారంటే.. సీఎంకు మాపై ఎంత ప్రేమ ఉందో దానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 

ఆళ్లగడ్డ ప్రజల చిరకాల కోరిక 30 పడకల ఆస్పత్రిని 50 పడకలు చేశాం. ఆదనంగా మరో 8 కోట్లు ఇస్తే వార్డులు, ఆపరేషన్‌ థియేటర్లు పూర్తిచేసి తొందరలోనే ఆళ్లగడ్డ ప్రజలకు ఉపయోగంలోకి తీసుకువస్తాం. ఆళ్లగడ్డ మున్సిపాలిటీ నిధులు ఆళ్లగడ్డ టౌన్‌ వరకే సరిపోతున్నాయి. మిగిలిన నాలుగు గ్రామాల్లో డ్రైనేజీ, రోడ్లు మెరుగు చేసుకోవడానికి నిధులు సరిపోవడం లేదు.. అదనంగా మున్సిపాలిటీకి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాం. ఆళ్లగడ్డలో 220కేవీ సబ్‌స్టేషన్‌ అవసరం ఉంది. చాగల్‌మ్రరి మండలంలో స్థలం కూడా గుర్తించాం. సబ్‌స్టేషన్‌ మంజూరు చేయాలని కోరుతున్నాం. ఆళ్లగడ్డ – రుద్రవరం రోడ్డులో 24 కిలోమీటర్‌ వద్ద హైలెవల్‌ బ్రిడ్జ్‌ మంజూరు చేయాలని కోరుతున్నాం. ఆళ్లగడ్డ వక్కిలేరు వాగుమీద కడప–కర్నూలు హైవే నుంచి రుద్రవరానికి కనెక్ట్‌ చేస్తూ ఒక హైలెవల్‌ బ్రిడ్జి ఏర్పాటు చేయాలి. ఈ కార్యక్రమాలన్నీ చేస్తారని కోరుకుంటున్నాను’’ అని ఎమ్మెల్యే బ్రిజేంద్రారెడ్డి అన్నారు.