ఉద్దేశపూర్వకంగానే సభలో టీడీపీ సభ్యుల గందరగోళం

16 Sep, 2022 11:59 IST

అసెంబ్లీ: టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా శాసనసభలో గొడవ చేస్తున్నారని, ప్రజలకు ఉపయోగపడే అంశాలను చర్చించే సమయంలో సభా సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ధరల గురించి మాట్లాడే అర్హత టీడీపీ సభ్యులకు లేదన్నారు.  కరోనా మహమ్మారి ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉందని, ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కవ.. మరో రాష్ట్రంలో తక్కువ ధరలు ఉన్నాయని ప్రతిపక్ష సభ్యులు నిరూపించగలరా..? అని ప్రశ్నించారు. బెంగళూరుకు వెళ్లినా, ముంబై వెళ్లినా అవే ధరలు ఉన్నాయన్నారు. 

కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలిగించకుండా ఎక్కడికక్కడ ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేసింది. గ్యాస్, పెట్రోల్, డీజిల్‌ ధరలు కేంద్రం నుంచి పెరుగుతున్నాయి. ధైర్యం ఉంటే కేంద్రాన్ని ప్రశ్నించండి అని ప్రతిపక్ష సభ్యులను ప్రశ్నించారు. సభ నుంచి సస్పెండ్‌ అయ్యి.. బయటకు వెళ్లి అరవడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ప్రభుత్వం మీద బురదజల్లే విధంగా ప్రతిపక్షం ప్రయత్నం చేస్తుంది. దీనికి ఒక అడ్డుకట్ట వేయాలని స్పీకర్‌ను గడికోట శ్రీకాంత్‌రెడ్డి కోరారు.