సెల్ఫీల పేరుతో టీడీపీ అసత్య ప్రచారం
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన నాసిరకం పనుల ముందు సెల్ఫీలు తీసుకుంటూపోతే.. అప్లోడ్ చేయడానికి ఫేస్బుక్లో పేజీలు కూడా సరిపోవని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సెల్ఫీల పేరుతో సంక్షేమ ప్రభుత్వంపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నెల్లూరులో 11వ డివిజన్లో గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాలుగేళ్లుగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికీ వివరించారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రామాల్లో పర్యటిస్తున్నామని చెప్పారు.
టీడీపీ హయాంలో నాసిరకంగా చేసిన అభివృద్ధి పనుల ముందు సెల్ఫీ తీసుకోవాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నేతలు ప్రెస్మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని నిందించడం, ధర్నా చేయడం తప్ప దేనికి పనికిరారన్నారు. సమస్యను సృష్టించి మరీ.. దాని ముందు సెల్ఫీ తీసుకొని అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వేసిన రోడ్లు ఏ విధంగా నాశనమయ్యాయో సెల్ఫీలు తీసుకుంటూపోతే అప్లోడ్ చేయడానికి ఫేస్బుక్ పేజీలు కూడా సరిపోవన్నారు. వైయస్ జగన్ ప్రభుత్వం అన్ని ప్రాంతాల అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని చెప్పారు. ఎవరు ప్రజల్లో తిరుగుతున్నారు.. ఎవరు కనిపించడం లేదనేది ప్రజలకు తెలుసని, 2024లో వైయస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తారన్నారు.