మేనిఫెస్టో విడుదల రాజ్యాంగ వ్యతిరేకం కాదా..?
తాడేపల్లి: పార్టీ రహిత పంచాయతీ ఎన్నికల్లో పచ్చకాగితంపై ఎన్టీఆర్, బాబు, మధ్యలో లోకేష్ ఫొటోలు పెట్టి మేనిఫెస్టో విడుదల చేసిన చంద్రబాబుపై ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? అని వైయస్‌ఆర్ సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికల్లో మేనిఫెస్టో రిలీజ్ చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా..? మతిపోయిన మాజీ ముఖ్యమంత్రి చర్యకు ఏం యాక్షన్ తీసుకుంటారో నిమ్మగడ్డ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడారంటే..
రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న నిమ్మగడ్డ మీడియా సమావేశాలు పదే పదే నిర్వహించాల్సిన అవసరం ఏముంది..? కానీ, మీడియా ముందుకు వచ్చి ఎస్‌ఈసీ వివాదస్పద మాటలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై కాలు దువ్వుతూ విమర్శలు చేయడం, అసహనం ప్రదర్శించడం చేస్తున్నారు.
ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ చంద్రబాబు స్ఫూర్తితోనే పనిచేస్తున్నాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న తెలుగుదేశానికి ప్రాణం పోయాలనే తాపత్రయంతో పనిచేస్తున్నాడు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీని బతికించే ప్రయత్నం చేసినా ప్రయోజనం ఉండదు. టీడీపీ పని అయిపోయింది.
సుప్రీం కోర్టు తీర్పును అందరం గౌరవిస్తున్నాం. ఆ తీర్పును ఆసరాగా చేసుకొని తనకేదో అధికారాలు కొత్తగా వచ్చినట్లు ప్రవర్తించడం నిమ్మగడ్డకు సరైంది కాదు. ప్రజాస్వామ్యంలో మితిమీరి ప్రవర్తించి లక్ష్మణరేఖ దాటితే కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే.
గ్రామాల్లో ఇంతకు ముందు జరిగిన ఏకగ్రీవాలకు ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు ఇవ్వలేదా..? దీనిపై ఏకగ్రీవ ఎన్నికలు జరగకూడదని రాజ్యాంగంలో రాసి ఉందా..? కక్షలు కార్పణ్యాలు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకునే విధానాన్ని ప్రోత్సహించాల్సిన రాజకీయ పక్షాలు.. తప్పుబట్టే ప్రయత్నం చేస్తున్నాయి.
పిచ్చి ముదిరింది.. రోకలి కొట్టమనే సామెతలా పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టో రిలీజ్ చేయడం ఏంటీ..? ఇది రాజ్యాంగానికి విరుద్ధం కాదా..? పల్లెల్లో రాజకీయ ప్రమేయాలు ఉండకూదు. పార్టీల గుర్తులు లేకుండా, పార్టీలకు అతీతంగా, ప్రమేయం లేకుండా పంచాయతీ ఎన్నికలు జరగాలని రాజ్యాంగంలో పొందుపరిచారు.
చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. నిమ్మగడ్డ ఇప్పుడు ఏం చేస్తారు..? దీనికి సమాధానం చెప్పాలి. మీడియా ద్వారా ఫిర్యాదు చేస్తున్నా.. కనీస సమాధానం చెప్పాలి. మతిపోయిన మాజీ ముఖ్యమంత్రి చర్యకు ఏం యాక్షన్ తీసుకుంటారో చెప్పాల్సిన బాధ్యత ఎస్‌ఈసీకి ఉంది.
రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలనే ప్రయత్నం నిమ్మగడ్డ, చంద్రబాబు చేస్తున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. నిమ్మగడ్డ ఓటును తిరస్కరించారట.. దుగ్గిరాల స్వగ్రామంలో అప్లయ్ చేసుకుంటే రిజక్ట్ చేశారట.. హైదరాబాద్‌లో ఉంటూ ఏపీలో ఓటు హక్కు కావాలంటే.. ఎలా ఇస్తారు.? ఓటు రిజక్ట్ చేశారని అధికారులపై కక్షగట్టి.. వారిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నావా..? నిమ్మగడ్డ..
కనకపు సింహాసనంపై శునకాన్ని కూర్చోబెడితే.. సర్వనాశనం చేసిందంట. అలాగే రాజ్యాంగ పదవిలో కూర్చున్న వ్యక్తి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమైన విషయం.
చంద్రబాబు లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన కొన్ని స్టాటిస్టిక్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ స్టాటిస్టిక్స్ ఎక్కడవని ఆరా తీస్తే.. 18–03–2002లో హోం శాఖ సెక్రటరీకి ఎస్‌ఈసీ లెటర్ రాశారు. ఆ లెటర్‌లో ఉన్న స్టాటిస్టిక్స్ చంద్రబాబు ప్రదర్శించారు. బహుశా.. ఈ స్టాటిస్టిక్స్ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ అయినా చంద్రబాబుకు చెప్పి ఉండాలి.. లేదా ఈ లెటర్ చంద్రబాబు అయినా రాసి ఉండాలి.
కడపలో ఏకగ్రీవాలు ఎక్కువయ్యాయి.. నువ్వేమయినా పోటుగాడివా.. అని సీఎంను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతున్నాడు. చంద్రబాబూ నీకు ఏం పోయేకాలం వచ్చింది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వే ఈ పదజాలం ఉపయోగిస్తావా..? చౌకబారు మాటలు మాట్లాడే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలు. గుర్తులు, జెండాలు ఉండవు, రాజకీయ ప్రచారాలు ఉండవు. ఎస్‌ఈసీకి అధికారం ఉంది కదా అని విగ్రహాలకు ముసుగులు తొడిగే ప్రయత్నం చేస్తుంది. లేని అధికారాన్ని తెచ్చుకొని ప్రవర్తిస్తే.. మూల్యం చెల్లించుకోక తప్పదు.