ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి వెంటనే కొనుగోలు చేయాలి
ఎన్టీఆర్ జిల్లా: మైలవరం మార్కెట్ యార్డులో మొక్కజొన్న, వరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అండగా వైయస్ఆర్‌సీపీ నిలుస్తుందని స్పష్టం చేస్తూ, ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం వెంటనే కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.బుధవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన జోగి రమేష్, అక్కడ నిల్వ ఉన్న మొక్కజొన్న, ధాన్యాన్ని పరిశీలించి రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. సుమారు 15 రోజులుగా రైతులు మార్కెట్ యార్డులో దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, అయినా కూటమి ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు.
“రైతుల ఆవేదన ఈ ప్రభుత్వానికి కనిపించడం లేదా..? అన్నదాత కన్నీరు మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు” అంటూ ఆయన మండిపడ్డారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నా, రైతులను పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు. ఈ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ సివిల్ సప్లయ్స్, వ్యవసాయ శాఖ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన జోగి రమేష్, తిరువూరు పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రైతులకు ఏమి సమాధానం చెబుతారని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యేకు రైతులు ఫోన్ చేసి సమస్యలు చెబుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. “ప్రతి దానిలో పావలా వాటాలు తీసుకుంటూ పావలా ప్రసాద్‌గా పేరుపొందాడు” అంటూ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మైలవరం నియోజకవర్గాన్ని “కేపి – పీకే కలిసి దోచేస్తున్నారు” అని ఆరోపించారు. రైతులే స్వయంగా ఎమ్మెల్యే నిర్లక్ష్య వైఖరిని చెబుతున్నారని పేర్కొన్న జోగి రమేష్, కూటమి ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేలుకోవాలని హెచ్చరించారు. సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోకపోతే రైతుల తరఫున వైయస్ఆర్‌సీపీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మండల పార్టీ అధ్యక్షులు, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారు.
