గీతం కాలేజీ భూదోపిడీని అడ్డుకుంటాం

29 Jan, 2026 15:03 IST

విశాఖ‌ప‌ట్నం:  విశాఖ‌ప‌ట్నంలో సుమారు రూ.5 వేల‌ కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని, విశాఖపట్నం ఎంపీ భ‌ర‌త్‌కి చెందిన‌ గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేసే ప్ర‌య‌త్నాల‌ను త‌క్ష‌ణం విర‌మించుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు. రేపు (ఈనెల 30వ తేదీన) జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చి క్రమబద్ధీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రను తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సంద‌ర్భంగా మండలి విప‌క్ష నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ ఆధ్వ‌ర్యంలో గీతం ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న భూముల ప‌రిశీల‌నకు వెళ్లిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను పోలీసులు అడ్డుకోవ‌డంతో అక్క‌డే రోడ్డుపై బైఠాయించి ధర్నాకు దిగారు. అనంత‌రం అక్క‌డే వారు మీడియాతో మాట్లాడుతూ ఈ భూముల బ‌ద‌లాయింపు అంశాన్ని ఎజెండా నుంచి తీసేస్తే త‌ప్ప రేపు జీవీఎంసీ కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌గ‌నివ్వ‌మ‌ని, మా కార్పొరేట‌ర్లు అడ్డుకుంటార‌ని హెచ్చ‌రించారు. చంద్ర‌బాబు కుటుంబ భూదోపిడీపై  పోరాటం మ‌రింత ఉధృతం చేస్తామ‌ని, ఎంపీ భ‌ర‌త్ భూదోపిడీపై పార్ల‌మెంట్‌లో సైతం గ‌ళం వినిపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రేపు మ‌రోసారి జీవీఎంసీ గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జాసంఘాలు, మేథావులు, ఉద్య‌మ కారుల‌తో క‌లిసి ఈ భూదోపిడీని నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిరస‌న కార్య‌క్ర‌మం ఉంటుంద‌ని చెప్పారు. పోలీసులు దోపిడీదారుల‌కు కాపాలాదారులుగా మారిపోయి, దోపిడీని అడ్డుకుంటున్న వైయ‌స్ఆర్‌సీపీనాయ‌కుల‌ను భూముల ప‌రిశీల‌న‌కు వెళ్ల‌కుండా ఆప‌డం స‌మంజ‌సం కాదని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. గీతం భూదోపిడీపై డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, బీజేపీ స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు నాయ‌కులు మాట్లాడారు. 
వారు ఇంకా ఏమ‌న్నారంటే.. 

ఈ నిర‌స‌న కార్యక్రమంలో శాసన మండలి విప‌క్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర జిల్లాల‌ రీజినల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా పార్టీ అధ్య‌క్షుడు కెకె రాజు, అన‌కాప‌ల్లి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు గుడివాడ అమర్నాథ్, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, ఎమ్మెల్సీలు వ‌రుదు క‌ళ్యాణి, కుంభ ర‌విబాబు, పండుల ర‌వీంద్ర‌, మాజీ ఎమ్మెల్యేలు క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ, అదీప్ రాజు, మళ్ళ విజయ ప్రసాద్, వాసుపల్లి గణేష్ కుమార్, భీమిలి నియోజ‌క‌వ‌ర్గ ఇంఛార్జ్‌ మజ్జి శ్రీనివాసరావు, తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావుల‌తోపాటు, రాష్ట్ర కార్యదర్శులు (నియోజకవర్గ పరిశీలకులు), పార్టీ అనుబంధ విభాగాల నాయ‌కులు  పాల్గొన్నారు.


చ‌ట్టాలంటే చంద్ర‌బాబుకి గౌర‌వం లేదా? 
- బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, మండ‌లి విప‌క్ష నేత‌

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి విశాఖ‌లో వేల కోట్ల విలువైన భూముల‌ను చంద్ర‌బాబు త‌న బినామీల‌కు ధారాద‌త్తం చేస్తున్నాడు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో గీతం భూదోపిడీ నుంచి కాపాడిన రూ. 5 వేల కోట్ల విలువైన 55 ఎక‌రాల భూముల‌ను ఇప్పుడు చంద్ర‌బాబు య‌థేచ్ఛ‌గా త‌న కొడుకు తోడ‌ల్లుడికి బ‌హుమానంగా ఇచ్చేస్తున్నాడు. ఇది ప్ర‌భుత్వానికి చెందిన భూమి అని, దీనిని ఆక్ర‌మిస్తే చ‌ట్ట‌ప‌రంగా శిక్షార్హులు అవుతార‌ని హెచ్చ‌రిక బోర్డులు పాతినా చంద్ర‌బాబు లెక్క చేయ‌డం లేదు. చ‌ట్టాల‌ను కాపాడాల్సిందిబోయి చ‌ట్టాల‌ను ఉల్లంఘిస్తున్నారు. పోలీసులు సైతం దోపిడీదారుల‌కు కాపాలాదారులుగా మారిపోయి, దోపిడీని అడ్డుకుంటున్న మమ్మ‌ల్ని అడ్డుకోవాల‌ని చూస్తున్నారు. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉంద‌ని చెప్పుకునే చంద్ర‌బాబు చెయ్యాల్సింది ఇదేనా. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నిర్మించిన ప్ర‌భుత్వ భ‌వనాల‌ను వైయ‌స్ జ‌గ‌న్ గారి సొంత ఆస్తులే అన్న‌ట్టు విషం చిమ్మిన ఎల్లో మీడియా, గీతం కాలేజీ 55 ఎక‌రాల భూదోపిడీ గురించి ఎందుకు చూపించ‌డం లేదు?  వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో నిర్మించిన ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌పై హ‌డావుడి చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్, గీతం కాలేజీ భూదోపిడీపై ఎందుకు నోరెత్త‌డం లేదు? ఆయ‌న ఈ భూక‌బ్జాను స‌మ‌ర్థిస్తున్నారా?  కోర్టు ఆదేశాల‌ను ఉల్లంఘించి మ‌రీ భూదోపిడీకి వ‌త్తాసు ప‌లుకుతున్న ఈ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తాం. ఈ నిర్ణ‌యం వెన‌క్కి తీసుకునే వ‌ర‌కు వైయ‌స్ఆర్‌సీపీ పోరాటం ఆప‌దు. బీజేపీ కూడా గీతం భూదోపిడీపై  స్పందించాలి. 

గ‌తంలో గీతం క‌బ్జా నుంచి ఈ భూమిని కాపాడాం
- కుర‌సాల క‌న్నబాబు, ఉత్త‌రాంధ్ర జిల్లాల రీజిన‌ల్ కోఆర్డినేట‌ర్ 

ఫీజుల రూపంలో పేద విద్యార్థుల నుంచి ల‌క్ష‌ల ఫీజులు వ‌సూలు చేస్తున్న గీతం యూనివ‌ర్సిటీకి, ఇప్పుడు రూ.5 వేల కోట్ల విలువైన 55 ఎక‌రాలు అప్ప‌నంగా క‌ట్ట‌బెట్టే కుట్ర‌లు జ‌రుగుతున్నాయి. మ‌హాత్మా గాంధీ పేరు పెట్టి వేలాది కోట్ల విలువైన భూముల క‌బ్జాకు ఎంపీ భ‌రత్ సిద్ధ‌మైపోతే, సీఎం చంద్ర‌బాబు అడ్డుకోకుండా ఆ భూముల‌ను క‌ట్ట‌బెట్ట‌డానికి సిద్ధ‌మైపోయాడు. ఈ భూమిని గీతం యూనివ‌ర్సిటీ క‌బ్జా చేసిన‌ట్టు గుర్తించి గ‌త వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఫెన్సింగ్ వేసి బోర్డులు పెడితే, గీతం భూదోపిడీకి ఇప్పుడు చంద్ర‌బాబు స‌హ‌కారం అందిస్తున్నాడు. చేతిలో అధికారం ఉంద‌నే అహంకారంతో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. విశాఖ ఎంపీ అయ్యుండీ ప్ర‌భుత్వం న‌డుపుతున్న ఆంధ్రా యూనివ‌ర్సిటీ గురించి దిగ‌జారుడు వ్యాఖ్య‌లు చేసిన భ‌ర‌త్‌కి ఈ భూములు క‌ట్ట‌బెట్ట‌డం సిగ్గుచేటు. చంద్ర‌బాబు కుటుంబ భూదోపిడీపై పార్ల‌మెంట్‌లో సైతం గ‌ళం వినిపిస్తాం. ఈ భూదోపిడీ నిర్ణ‌యాన్ని వెన‌క్కి తీసుకునేదాకా వైయ‌స్ఆర్‌సీపీ ఉద్య‌మిస్తుంది. క‌బ్జా భూముల‌ను ప‌రిశీలించ‌డానికి వ‌చ్చిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుల‌ను పోలీసుల‌ను మోహ‌రించి అడ్డగించారు. కూట‌మి ప్రభుత్వం ఇలాగే వ్య‌వ‌హ‌రిస్తే రాబోయే రోజుల్లో మూల్యం చెల్లించుకోక‌త‌ప్ప‌దు. కూట‌మి ప్ర‌భుత్వానికి నిజంగా ప్ర‌జాసేవ చేయాల‌న్న చిత్త‌శుద్ధి ఉంటే ఈ నిర్ణ‌యాన్ని త‌క్ష‌ణం వెన‌క్కి తీసుకోవాలి. మా హెచ్చ‌రిక‌ల‌ను పెడ‌చెవిన పెట్టి ప్ర‌భుత్వం ముందుకెళితే వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్ రంగంలోకి దిగుతారు. 


గీతం భూదోపిడీని చూస్తూ ఊరుకోం
- కెకె రాజు, విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు

గీతం యూనివ‌ర్సిటీ ఆక్ర‌మ‌ణ‌లో ఉన్న భూమిని వారికే ధారాద‌త్తం చేసే విధంగా జీవీఎంసీ కౌన్సిల్ ఎజెండాలో పెట్టి వారికే క‌ట్ట‌బెట్టే కుట్ర‌ల‌ను వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది. ప్ర‌జ‌ల ఆస్తుల‌ను ప్రైవేట్‌కి అప్ప‌నంగా క‌ట్ట‌బెడుతుంటే ఎట్టిప‌రిస్థితుల్లో చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్ప‌టికే ఈ వ్య‌వ‌హారంపై విశాఖ ప్ర‌జ‌ల్లో తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చింది. ఈ అడ్డ‌గోలు భూ సంత‌ర్ప‌ణ‌ను నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో ప్ర‌జ‌ల ప‌క్షాన ఉద్య‌మిస్తున్నాం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని సీఎం చంద్ర‌బాబు త‌న కుటుంబ స‌భ్యుల‌కు వేలాది కోట్ల విలువైన ప్ర‌జా సంప‌ద‌ను దోచిపెట్ట‌డం స‌రికాదు. జీవీఎంసీలో పెట్టిన ఈ తీర్మాణాన్ని వ్య‌తిరేకిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్లంతా కూడా రేపు నిర‌స‌న తెలియ‌జేస్తారు. ఈ అడ్డ‌గోలు భూదోపిడీ ఆగేదాకా వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ఉద్యమిస్తూనే ఉంటాం. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌పై జ‌రుగుతున్న వైయ‌స్ఆర్‌సీపీ పోరాటాల‌కు గొంతు క‌లిపే వారినంద‌ర్నీ క‌లుపుకొని పోతాం. రేపు జీవీఎంసీ వ‌ద్ద ఉన్న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద ప్ర‌జాసంఘాలు, మేథావులు, ఉద్య‌మ కారుల‌తో ఈ భూదోపిడీని నిర‌సిస్తూ వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వ‌ర్యంలో నిరస‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తాం. 

ఎజెండా నుంచి తీసేసేదాకా కౌన్సిల్ స‌మావేశం జ‌ర‌గ‌నివ్వం 
- గుడివాడ అమ‌ర్నాథ్‌, అన‌కాప‌ల్లి జిల్లా పార్టీ అధ్య‌క్షుడు

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి సీఎం చంద్ర‌బాబు విశాఖ‌లో విలువైన భూముల‌ను పెట్టుబ‌డుల పేరుతో సూట్‌కేస్ కంపెనీల‌కు ధారాద‌త్తం చేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. ఇప్పుడు నేరుగా చంద్ర‌బాబు నాయుడు కుటుంబానికే చెందిన గీతం యూనివ‌ర్సిటీకి 55 ఎక‌రాల భూములు క‌ట్ట‌బెట్ట‌డానికి సిద్ధ‌మైపోయాడు. ఏం చేసినా అడిగే వారుండ‌రు అనే ధీమాతో చంద్ర‌బాబు విచ్చ‌ల‌విడి భూదోపిడీకి పాల్ప‌డుతున్నాడు. దీన్ని వైయ‌స్ఆర్‌సీపీ తీవ్రంగా వ్య‌తిరేకిస్తుంది. రేపు జ‌ర‌గ‌బోయే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలోనూ మా కార్పొరేట‌ర్లు అడ్డుకుంటారు. ఎజెండా నుంచి ఈ భూ బ‌ద‌లాయింపు అంశాన్ని తీసేస్తే త‌ప్ప కౌన్సిల్ స‌మావేశాన్ని జ‌ర‌గనివ్వం. కాద‌ని ముందుకెళితే రాబోయే రోజుల్లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఖ‌చ్చితంగా వెన‌క్కి తీసుకోవ‌డం జ‌రుగుతుంది. గ‌తంలో చంద్ర‌బాబు సీఎంగా ఉండగా ఇదే యూనివ‌ర్సిటీకి 71 ఎక‌రాల భూమిని కేవ‌లం రూ. 15 ల‌క్ష‌ల‌కే క‌ట్ట‌బెట్టాడు. ఈ భూమి విలువ ఇప్పుడు రూ.7 వేల కోట్లు ఉంటుంది.