కోనసీమ ద్రాక్షారామంలో వైయస్ఆర్‌సీపీ నేతల పర్యటన

31 Dec, 2025 12:50 IST

డాక్ట‌ర్ అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా:  ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో చోటుచేసుకున్న శివలింగ ధ్వంసం ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ద్రాక్షారామ భీమేశ్వరాలయంలో ఉత్తర గోపురం సమీపంలో, సప్తగోదావరి ఒడ్డున ఉన్న కపాలేశ్వర స్వామి శివలింగాన్ని సోమవారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ధ్వంసం చేయగా, మంగళవారం ఉదయం స్థానికులు గుర్తించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై భక్తులు, హిందూ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ద్రాక్షారామాన్ని సందర్శించి, నూతన శివలింగ పునఃప్రతిష్ట జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. విచారణ పూర్తికాకుండానే, ఎటువంటి సంప్రోక్షణ లేకుండా హడావిడిగా మరో శివలింగాన్ని ప్రతిష్టించడంపై ఆలయ ఈవో దుర్గాభవానీపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

శివ‌లింగం ధ్వంసం కావ‌డం దారుణం:  తోట త్రిమూర్తులు
“ద్రాక్షారామం శైవక్షేత్రంలో కోనేటి శివలింగం ధ్వంసం కావడం అత్యంత దారుణం. ధ్వంసమైన శివలింగానికి వేల ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి పవిత్రమైన లింగం ధ్వంసం అయిన ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరగకుండానే, ఎటువంటి సంప్రోక్షణ లేకుండా మరో లింగాన్ని హడావిడిగా ప్రతిష్టించడం అపచారం. ఇది ఎవరి ఆదేశాలతో జరిగింది? హడావుడిగా కార్యక్రమం ఎందుకు చేశారు?” కూటమి ప్రభుత్వం వ్యవస్థలను సర్వనాశనం చేస్తోంది, మాట్లాడితే సనాతన ధర్మం అంటారు. ఇదేనా సనాతన ధర్మం? ఆలయ నిర్వహణ అధికారి ఆలయానికి రెగ్యులర్‌గా ఎందుకు రావడం లేదు?” అంటూ తీవ్ర తోట త్రిమూర్తులు ప్ర‌శ్నించారు.

శివాలయంపై దాడి దుర్మార్గం:  దేవాలయ శాఖ మాజీ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ 
“దక్షిణ కాశీగా పేరుగాంచిన ద్రాక్షారామంలో శివాలయంపై దాడి దుర్మార్గం. ఇంతటి ఘోర ఘటన జరిగినా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎందుకు స్పందించలేదు? ఎలాంటి సంప్రోక్షణ జరగకుండానే విగ్రహాన్ని పునఃప్రతిష్టించడం అపచారం కాదా? టీడీపీ కూటమి పాలనలో సనాతన ధర్మం ప్రమాదంలో పడింది. ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు? ఆలయాలపై జరుగుతున్న దాడులపై ఎందుకు మౌనంగా ఉన్నారు? రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితుడికి ఐదు లక్షల రూపాయల సాయం ఎందుకు ఇచ్చారు? చంద్రబాబు సర్కారుకు రాజకీయ లబ్ధి మినహా హిందువుల మనోభావాలు అక్కర్లేదా?” అంటూ అనంత‌పురంలో మీడియా స‌మావేశంలో జ్వాలాపురం శ్రీ‌కాంత్‌ ప్రశ్నల వర్షం కురిపించారు.