మెగా డీఎస్సీ పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారు
విజయవాడ : మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలోని లక్షలాది మంది నిరుద్యోగ యువత ఆశలతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపిస్తూ ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. రామా క్లాత్ షోరూమ్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు చేపట్టిన ర్యాలీలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్‌రావు, తిరువూరు ఇన్‌చార్జ్ నల్లగట్ల స్వామిదాసు, జగ్గయ్యపేట ఇన్‌చార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్యతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగ యువతను పూర్తిగా మోసం చేసిందని విమర్శించారు. మెగా డీఎస్సీ అంటూ భారీ ప్రచారం చేసి, చివరకు అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకుందని ఆరోపించారు. డీఎస్సీ నియామక ప్రక్రియలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు, నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
డీఎస్సీ నిర్వహణలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని కోరారు. డీఎస్సీ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ స్పోర్ట్స్ కోటా నియామకాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. ఈ అంశాలపై సంబంధిత అధికారులు కాకుండా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్‌రావు మాట్లాడుతూ డీఎస్సీ నియామకాలు పూర్తిస్థాయిలో పారదర్శకంగా సాగలేదనే సందేహాలు అభ్యర్థుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. నియామక ప్రక్రియపై పూర్తి వివరాలను ప్రభుత్వం వెల్లడించి అభ్యర్థుల అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు.
జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కొరివి చైతన్య మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైయస్ఆర్‌సీపీ యువజన విభాగం పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. డీఎస్సీ అభ్యర్థుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, డివిజన్ స్థాయి నాయకులు, మాజీ కార్పొరేటర్లు, యువజన విభాగం నాయకులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.