రేషన్ డీలర్‌పై టీడీపీ గూండాల దాడి
పల్నాడు జిల్లా: వినుకొండ నియోజకవర్గంలో టీడీపీ గూండాలు బరితెగించారు. బొల్లాపల్లి మండలం పలుకులు గ్రామం రేషన్ డీలర్ అర్జున్ రావు పై పచ్చమూకలు దాడి చేసి గాయపరిచారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ ఒత్తిళ్లతో అర్జున్ రావుని రేషన్ డీలర్ పదవి నుండి తొలగించారు. దీనిపై న్యాయపరంగా పోరాటం చేసిన అర్జున్ రావు కోర్టులో విజయం సాధించారు. రేషన్ షాపును అర్జున్‌రావుకు తిరిగి అప్పగించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో అసంతృప్తికి లోనైన పలుకూరు గ్రామం టీడీపీ నేతలు సంపత్ సుబ్బారావు, సంపత్ మల్లేశ్వరరావు, మరికొందరు వ్యక్తులు అర్జున్ రావుపై వినుకొండ పట్టణం లోని వెల్లటూరు రోడ్డు సమీపంలో కాపు కాసి దాడి చేశారు. ఈ ఘటనలో అర్జున్ రావు గాయపడగా, స్థానికుల సహకారంతో వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
అర్జున్ రావుపై దాడిని వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీలర్‌ను ప్రముఖ న్యాయవాది, వైయస్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా అధికార ప్రతినిధి ఎంఎన్ ప్రసాద్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అమ్మిరెడ్డి అంజి రెడ్డి, మండల కన్వీనర్, సర్పంచ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, నియోజకవర్గ అనుబంధ అధ్యక్షులు మండల అనుబంధ అధ్యక్షులు, కో కన్వీనర్, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పరామర్శించారు.