కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోంది
అనకాపల్లి: కూటమి పాలన రాక్షస పాలనను తలపిస్తోందని శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. రాష్ట్రాన్నిఅప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చారని విమర్శించారు. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారని అన్నారు. అనకాపల్లి జిల్లాలో సోమవారం వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ, పెట్ల ఉమా శంకర్ గణేష్, వరుదు కళ్యాణి, కంబాల జోగులు, అదీప్ రాజు, కన్నబాబు రాజు, మలసాల భరత్, శోభ హైమవతి, మాజీ ఎంపీ సత్యవతి, బొడ్డెడ ప్రసాద్, కేకే రాజు, పార్టీ నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ..‘సంక్షేమం అభివృద్ధిని రెండు కళ్ళుగా వైయస్ జగన్ పరిపాలన చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో వైయస్ఆర్‌సీపీ ఓడిపోయింది. కూటమి పాలనలో ప్రజలకు ఏం మేలు జరిగిందో ఒకసారి ఆలోచించాలి. 11 నెలల పాలనలో ప్రజలకు చేసింది శూన్యం. 11 నెలల్లో లక్ష 50 వేల కోట్లు అప్పు చేశారు. ఇంత అప్పు చేసిన చరిత్ర గతంలో ఎన్నడూ లేదు. అప్పు చేసిన లక్ష 50 వేల కోట్లు ఏం చేశారో చెప్పాలి. కూటమి పాలనలో ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు. భర్త చనిపోతేనే కొత్త పెన్షన్ భార్యకు ఇవ్వాలని జీవో ఇచ్చారు. వైయస్ జగన్ పాలనలో అర్హులకు పెన్షన్ లు అందజేశారు. సినిమా డైలాగ్ మాదిరిగా చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్లు అమరావతికి పున: ప్రారంభం చేశారు. అమరావతికి లక్ష కోట్లు తెచ్చుకోవాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుకు లేదా?. విశాఖ నూతన రైల్వే జోన్ ఏమైంది?. రైల్వే భవనాలు ఎందుకు నిర్మించలేదు. మూడు టీవీలు, మూడు పేపర్లతో పబ్బం గడుపుతున్నారు. 99 పైసలకు ఎకరా భూమి ఇస్తున్నారు. రాష్ట్రాన్ని ఏం చేయాలని చూస్తున్నారు. సింహాచలం కొండ మీద మరణాలు సంభవించాయి. నాయకుల ప్రచార పిచ్చితో ఏడుగురు భక్తులు మరణించారు. సింహాచలంలో మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే’ అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆక్షేపించారు.
త్వరలో జగనన్న 2.0 పాలన: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
‘టీడీపీ ఓడిపోయిన తరువాత నాలుగేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలు, నాయకులు బయటకు రాలేదు. ఆరు నెలలకే వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలు ధైర్యంగా రోడ్డు మీదకు వస్తున్నారు. వైయస్ జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారు. రానున్న రోజుల్లో జగనన్న 2.0 పాలన వస్తుంది. కార్యకర్తలకు అండగా వైయస్ జగన్ ఉంటారు. 60 అడుగుల గోడ కట్టలేని వ్యక్తి అమరావతి కడతానని మాట్లాడుతున్నారు. చంద్రబాబు ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన భక్తులు చనిపోతున్నారు. చంద్రబాబు పాపాలకు భక్తులు శిక్ష అనుభవిస్తున్నారు’ అని గుడివాడ అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ..‘వైయస్ జగన్ రామరాజ్య పాలన అందించారు. కూటమి రాక్షస పాలనను తలపిస్తుంది. ఏపీని అప్పుల ఆంధ్ర ప్రదేశ్‌గా మార్చివేశారు. ప్రతీ కార్యకర్తకు వైయస్ జగన్ అండగా ఉంటారు.
కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. ‘అమర్నాథ్‌కు అనకాపల్లి జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సంతోషం. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుంది. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడి పని చేయాలి. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రతి నాయకుడు కృషి చేయాలి`.
మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ.. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక తప్పుడు కేసులు పెడుతుంది. వాటన్నిటినీ ధైర్యంగా ఎదుర్కుంటున్నాము. ప్రభుత్వంపై వ్యతిరేకత మూడు నెలలకే బయట పడింది. టీడీపీ నేతలు ప్రజల్లోకి వెళ్లేందుకు భయపడుతున్నారు.`
కన్నబాబు రాజు మాట్లాడుతూ.. ‘కూటమిలో గొడవలు అప్పుడే మొదలయ్యాయి. 2026లో కూటమిలో చీలిక ఏర్పడుతుంది. చంద్రబాబు ఇచ్చిన హామీలను ఎన్నడూ అమలు చేయరు. రానున్న రోజుల్లో వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి వస్తుంది` అని విశ్వాసం వ్యక్తం చేశారు.
బుడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ..‘పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదు. వైయస్ జగన్ నాయకులకు కార్యకర్తలకు న్యాయం చేస్తారు. రాష్ట్రంలో మరోసారి వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రాబోతుంది. ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే రోజు దగ్గరలోనే ఉంది` అని అన్నారు.