కల్తీ లడ్డూ తప్పుడు ప్రచారం, ఫ్లెక్సీలపై పోలీసులకు ఫిర్యాదు
ఒంగోలు: కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న కల్తీ లడ్డూ తప్పుడు ప్రచారంలో భాగంగా ఒంగోలు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో అపరిచితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని గత రెండు రోజులుగా మున్సిపల్ అధికారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీసులను ఆశ్రయించారు. ఈ రోజు (02-02-2026) సోమవారం ఉదయం ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబు , పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానంద రెడ్డి , జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు నగరికంటి శ్రీనివాసరావు తో పాటు ఇతర ముఖ్య నాయకులు కలిసి ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు హిందువుల మనోభావాలను కించపరచడమే కాకుండా, పట్టణంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నాయకులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా, ఎవరి పేరు, ప్రింటింగ్ వివరాలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వెనుక కుట్ర కోణం ఉందని వారు అనుమానం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ నాయకులు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే కూటమి నేతలు అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోట్లాది భక్తుల విశ్వాసాలకు భంగం కలిగించేలా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అనంతరం ఈ అంశానికి సంబంధించిన వివరాలను మీడియాకు తెలియజేస్తామని నాయకులు తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, తప్పుడు ప్రచారాలతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సహించదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.