ఆకాల వర్షాలతో పంటల నష్టం…
అనంతపురం: అనంతపురం జిల్లాలో కురిసిన ఆకాల వర్షాలు, ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. గుంతకల్లు నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైతు విభాగం నాయకులు గుంతకల్లు ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవోను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా నైరుతిరెడ్డి మాట్లాడుతూ..మార్చి 18న రాత్రి కురిసిన ఆకాల వర్షాలు, ఈదురు గాలుల కారణంగా గుంతకల్లు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. ముఖ్యంగా గుంతకల్లు మండలంలోని అయ్యావారిపల్లి, ఇమాంపురం గ్రామాలు, పామిడి మండలంలోని జి.కొట్టాల, కొండాపురం, అక్కజంపల్లి, దేవరపల్లి గ్రామాల్లో రైతులు భారీ నష్టాలు చవిచూశారని పేర్కొన్నారు. మొక్కజొన్న, మామిడి, అరటి, వరి, మిరప, టమోటా తదితర పంటలు నష్టపోయాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
గతంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి విపత్తుల సమయంలో 15 రోజుల్లోనే నష్టపరిహారం అందించారని గుర్తుచేశారు. అలాగే మిర్చి, వరి, అరటి, కంది వంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి రైతులను ఆదుకున్నారని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకున్న ఉదాహరణలు లేవని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని, లేనిపక్షంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు బాబురావు యాదవ్, మండల, పట్టణ నాయకులు జగదీష్వర రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎం.డి.ఆర్ ఖలీల్, బీసీ సెల్ అధ్యక్షుడు రంగనాయకులు, యువజన విభాగం అధ్యక్షుడు అబ్దుల్ బాసిత్, వాలంటీర్ వింగ్ అధ్యక్షుడు పవన్, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి రియాజ్, రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శి దాసరి చిన్నరాయుడు తదితరులు పాల్గొన్నారు.