కూట‌మి పాల‌న‌లో క‌ల్తీ నిత్య‌కృత్యం

24 Feb, 2026 16:53 IST

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం:  కూట‌మి పాల‌న‌లో పాలు, నీళ్లు, ఆహారం, మ‌ద్యం.. ఇలా అన్నింటా క‌ల్తీ అనేది 
నిత్య‌కృత్య‌మైంద‌ని, పాల‌న‌పై సీఎం చంద్ర‌బాబు ప‌ట్టుకోల్పోయాడ‌నివైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు స్ప‌ష్టం చేశారు. తూర్పు గోదావ‌రి జిల్లా రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో క‌ల్తీ పాల కార‌ణంగా అస్వ‌స్థ‌త‌కు గురై ప‌లు ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న‌ బాధితుల‌ను ప‌రామ‌ర్శించిన అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ కూట‌మి 20 నెల‌ల పాల‌న‌లో మొత్తం 36 ఘ‌ట‌న‌లు జ‌రిగితే 900 మందికి పైగా బాధితులు ఆస్ప‌త్రి పాల‌య్యార‌ని, 40 మంది అమాయ‌కులైన పేద విద్యార్థులు చ‌నిపోయార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అవినీతి సంపాద‌న మీద దృష్టిపెట్టిన చంద్ర‌బాబు పాల‌న‌ను పూర్తిగా గాలికొదిలేశాడ‌ని దాని ఫ‌లితంగానే క‌ల్తీల‌తో నేర‌గాళ్లు రెచ్చిపోతున్నార‌ని స్ప‌ష్టం చేశారు. గ‌త వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో ఇలాంటి ఘ‌ట‌న ఒక్క‌టీ జ‌ర‌గ‌లేద‌ని, కానీ కూట‌మి పాల‌న‌లో స‌ర్వ‌సాధార‌ణం అయిపోయినా ప్ర‌భుత్వానికి క‌నీసం చీమ‌కుట్టిన‌ట్ట‌యినా ఉండ‌టం లేద‌న్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌శ్నించిన‌ప్పుడు మాత్రం ప‌రిహారం ప్ర‌క‌టించి చేతులు దులిపేసుకుంటున్నారే త‌ప్ప‌, పున‌రావృతం కాకుండా చూడ‌టంపై వైద్యారోగ్య‌శాఖ దృష్టిపెట్ట‌డం లేద‌ని ఆరోపించారు. అస‌లీ రాష్ట్రంలో వైద్యాశాఖ‌ మంత్రి ఉన్నాడా అనే అనుమానం క‌లుగుతోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పాల క‌ల్తీ ఘ‌ట‌న‌లో మృతి చెందిన కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల ప‌రిహారం చెల్లించాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు డిమాండ్ చేశారు. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న కుటుంబాల‌కు వైద్య ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రించాల‌ని, ఇప్ప‌టికే బిల్లులు చెల్లించి ఉంటే వాటిని బాధితుల‌కు రీయింబ‌ర్స్ చేయాల‌న్నారు. ప్ర‌భుత్వం ఇప్పటికైనా డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌కుండా చిత్త‌శుద్ధితో ప‌నిచేసి బాధితుల‌కు న్యాయం చేయాల‌ని సూచించారు. 
మీడియా స‌మావేశంలో మాజీ మంత్రులు విడ‌ద‌ల ర‌జిని, చెల్లుబోయిన వేణు గోపాల‌కృష్ణ‌, తానేటి వ‌నిత‌, సీదిరి అప్ప‌ల‌రాజు, మాజీ ఎంపీ మార్గాని భ‌ర‌త్‌, మాజీ ఎమ్మెల్యేలు జ‌క్కంపూడి రాజా, త‌లారి వెంక‌ట్రావు, వైయ‌స్ఆర్‌సీపీనాయ‌కుడు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

● క‌ల్తీ రాజ‌కీయాల‌తో పాల‌నను ప‌క్క‌దోవ ప‌ట్టించాడు
- చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, మాజీ మంత్రి 

రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో చోటుచేసుకున్న కల్తీ పాల స‌ర‌ఫ‌రా ఘ‌ట‌న‌లో అధికారికంగా ఇప్ప‌టికే ఐదుగురు ప్రాణాలు కోల్పోగా 19 మంది వెంటిలేట‌ర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆస్ప‌త్రికి చేర‌కుండానే ఒక‌రు చ‌నిపోయారు. ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే మాజీ సీఎం వైయ‌స్ జగన్ గారు పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. ప్రజారోగ్యంపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా క‌నిపిస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై ప్రతిపక్షం స్పందించిన త‌ర్వాతే ప్రభుత్వం స్పందించింది. సంబంధిత మంత్రులెవరూ ఇప్పటివరకు స్పందించనే లేదు. పాల‌న‌లో చంద్ర‌బాబు  పూర్తిగా ప‌ట్టుకోల్పోయారు. క‌ల్తీ రాజ‌కీయాల‌తో పాల‌న‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించాడు. ఎన్ని అరాచ‌కాలు చేసినా త‌మ‌కు ఏమీ కాద‌నే ధీమాతో నేరస్తులు రెచ్చిపోతున్నారు. మృతుల కుటుంబాల‌కు ప్ర‌భుత్వం త‌ర‌ఫున రూ.25 ల‌క్ష‌ల ప‌రిహారం అందించ‌డంతోపాటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి వైద్యం ఖ‌ర్చులు ప్ర‌భుత్వ‌మే భ‌రించాలి. బాధితులు ఎక్క‌డెక్కడ ఉన్నారో గుర్తించి వారికి మెరుగైన వైద్యం అందించాలి. బాధితుల ప‌క్షాన వైయ‌స్ఆర్‌సీపీ పోరాడుతుంది. వారికి మేం నిత్యం అందుబాటులో ఉంటాం. 


● పాలు, నీళ్లు, తిండి, మ‌ద్యం.. అన్నీ క‌ల్తీనే 
- విడదల రజిని, మాజీ మంత్రి

కల్తీ మాట‌ల‌తో అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం పాల‌న కూడా క‌ల్తీ చేసింది. అందుకే పాలు, తిండి, నీరు, ఆఖరుకి క‌ల్తీ మ‌ద్యం.. ఇలా ప్ర‌తిదాన్నీ క‌ల్తీ చేస్తూ దోపిడీ చేసే వారి ఆగడాలు ఎక్కువైపోయాయి. రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖ నిద్ర‌పోతోంది. ఫుడ్ సేఫ్టీ వ్యవస్థ పని చేస్తుందా?  కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా 900 మంది డయేరియాతో ఆస్ప‌త్రుల్లో చేరారు. సంక్షేమ హాస్ట‌ళ్ల‌లో చ‌దివే ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు. కల్తీ పాలతో అస్వ‌స్థ‌త‌కు గురైన బాధితులు రాజమండ్రి ,కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే వైద్యం నిరాక‌రిస్తున్నారు. ప్రైవేట్ ఆస్ప‌త్రులు ల‌క్ష‌ల ఫీజుల‌తో దోపిడీ చేస్తున్నారు. క‌ల్తీ పాల‌తో ఆస్వ‌స్థ‌త‌కు గురై రెయిన్ ఆస్ప‌త్రిలో చేరిన రితిక్ అనే బాలుడిని కాపాడుకునేందుకు త‌ల్లిదండ్రులు రూ. 8.50 ల‌క్ష‌ల బిల్లులు క‌ట్టాల్సి వ‌చ్చింది. ఫిబ్ర‌వ‌రి 16 నుంచి క‌ల్తీ పాల‌ దారుణాలు వెలుగుచూసినా స్పందించాల్సిన ప్ర‌భుత్వం మొద్దు నిద్ర‌పోతోంది. క‌ల్తీ పాల‌తోపాటు బాధితుల నుంచి బ్ల‌డ్‌ శాంపిల్స్ తీసుకున్నామ‌ని చెబుతున్నారే కానీ వాటి రిపోర్టులు బ‌య‌ట‌పెట్ట‌డం లేదు. కల్తీ పాల వల్ల రీనల్ ఫెయిల్యూర్ జరిగింద‌ని చెబుతున్నారు. బాధితుల‌కు ఏకంగా డ‌యాల‌సిస్ చేయాల్సిన దుస్థితి ఏర్ప‌డిందంటే ప‌రిస్థితి ఘోరంగా ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. అయినా వైద్యారోగ్య‌శాఖ స్పందించ‌డం లేదు. 

● డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ కాకుండా నిజాయితీగా ప‌నిచేయాలి
- తానేటి వనిత, మాజీ మంత్రి

రాజ‌మండ్రి చ‌రిత్ర‌లో ఎప్పుడూ జ‌ర‌గ‌ని ఘోరం ఇది. ఏమ‌వుతుందో తెలుసుకునే లోపే ఐదుగురు చ‌నిపోయారు. ఎంతోమంది వెంటిలేట‌ర్ల మీద చికిత్స పొందుతున్నారు. పాల‌లో క‌ల్తీ జ‌రిగింద‌ని నిర్ధారించడానికి ప్రభుత్వానికి వారం రోజులు ప‌ట్టింది. ఒకే కుటుంబానికి చెందిన వారంతా ఆస్ప‌త్రి పాల‌వ‌డంతో వైద్యుల‌కు అనుమానం వ‌చ్చి  పాల కల్తీ వ్యవహారాన్ని నిర్ధారించారు. గ‌తంలో వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో ఆరోగ్య‌శ్రీ ద్వారా బాధితుల‌ను ఆదుకోవ‌డం జ‌రిగింది. ఇప్పుడు ఆరోగ్య‌శ్రీ ప‌నిచేయ‌డం లేదు. ల‌క్ష‌ల్లో బిల్లులు చెల్లించ‌లేని ప‌రిస్థితుల్లో బాధితులున్నారు. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులంద‌రికీ మెరుగైన వైద్యం అందించి ఆదుకోవాలి. మృతుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల ప‌రిహారం అందించ‌డంతోపాటు ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిని క‌ఠినంగా శిక్షించాలి. ప్ర‌భుత్వం డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయడం మానుకుని నిజాయితీగా వ్య‌వ‌హరించి బాధితుల‌ను ఆదుకోవాలి. బాధిత కుటుంబాల‌కువైయ‌స్ఆర్‌సీపీ అండ‌గా ఉంటుంది. 

● ప‌రిహారం ఇచ్చి చేతులు దులిపేసుకునే కుట్ర 
- సీదిరి అప్ప‌ల‌రాజు, మాజీ మంత్రి

క‌ల్తీ పాల వ్య‌వ‌హారం చూస్తే ప్ర‌భుత్వ వైఫ‌ల్యం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. వంద‌ల కుటుంబాల్లో బాధితులున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి పేదవాడికి వైద్యం అంద‌ని ద్రాక్ష‌గా మారిపోయింది. 20 నెల‌ల్లో రాష్ట్ర‌వ్యాప్తంగా వేల‌మంది ఆస్ప‌త్రుల పాలైన ఘ‌ట‌న‌లున్నా ఇప్ప‌టికీ ప్ర‌భుత్వ తీరులో మార్పు రావ‌డం లేదు. 2024 జూలై లో తొలిసారి శ్రీకాకుళం కేజీబీవీ హాస్ట‌ల్‌లో డ‌యేరియా ప్ర‌బ‌లిన‌ప్పుడే ప్ర‌భుత్వం చిత్త‌శుద్ధితో ప‌నిచేసి ఉంటే ఇన్ని దారుణాలు జ‌రిగేవి కావు. గ‌త ఐదేళ్ల వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో ఇలాంటి ఘ‌ట‌న ఒక్క‌టీ చూడ‌లేదు. కానీ కూట‌మి పాల‌న‌లో కల్తీ అనేది నిత్య‌కృత్య‌మైంది. 20 నెల‌ల్లో 36 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యానికి ఎక్కువ మంది పేద విద్యార్థులే బ‌లైపోతున్నారు. అయినా ఈ ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్టు కూడా ఉండ‌టం లేదు. వైద్యారోగ్య‌శాఖ మంత్రి అనేవాడు ఉన్నాడా అనే అనుమానం క‌లుగుతోంది. ఘ‌ట‌న‌లు జ‌రిగిన్ప‌పుడు ప‌రిహారం ప్ర‌క‌టించి ప్ర‌భుత్వం చేతులు దులిపేసుకుంటోంది. చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో సింథ‌టిక్ మిల్క్ త‌యారీ యూనిట్ వెలుగులోకి వ‌చ్చినా క‌నీసం ప‌ట్టించుకోలేదు. మంత్రి, ముఖ్యమంత్రి దాని గురించి క‌నీసం రివ్యూ చేసిన పాపాన‌పోవ‌డం లేదు. క‌ల్తీ పాల ఘ‌ట‌నను డైవ‌ర్ట్ చేసి ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను ప‌క్క‌దారి ప‌ట్టించ‌డానికి ఇప్ప‌టికే ఎల్లో మీడియా రంగంలోకి దిగింది. అవినీతి, దోపిడీపైనే దృష్టి పెట్టిన చంద్ర‌బాబు.. పాల‌న గాలికొదిలేశాడు. పాల‌న‌పై ప‌ట్టుకోల్పోయాడు. వైయ‌స్ఆర్‌సీపీ హ‌యాంలో మిల్క్ ప్రొక్యూర్‌మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు. కానీ ఆ నిబంధ‌న‌లు ఏవీ ఇప్పుడు అమ‌లు కావ‌డం లేదు. దాన్ని ప‌ట్టించుకునే యానిమ‌ల్ హజ్బెండ‌రీ డైరెక్ట‌ర్ అనేవాడే లేడు. ఇలాంటి ఘ‌ట‌న‌లు గ‌తంలో వైయ‌స్ఆర్‌సీపీహయాంలో జ‌రిగితే వారికి ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా వైద్యం అందించ‌డం జ‌రిగేది. కానీ నేడు ఆరోగ్య‌శ్రీ అనే పేరే వినిపించ‌డం లేదు. కూటమి పాల‌న‌లో క‌ల్తీ కాటుకి ఇప్ప‌టికే దాదాపు 40 మంది పిల్లలు చ‌నిపోయారు. 

● ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో క‌నీస సౌక‌ర్యాలు లేవు
- మార్గాని భ‌ర‌త్‌, మాజీ ఎంపీ

రాష్ట్రంలో వ‌రుస‌గా జ‌రుగుతున్న ఇలాంటి ఘ‌ట‌న‌లు చూస్తుంటే ప్రభుత్వం బ‌తికే ఉందా అనిపిస్తుంది. ముఖ్య‌మంత్రి అసెంబ్లీలో రూ.10 ల‌క్ష‌ల ప‌రిహారం ప్ర‌క‌టిస్తే దానికి ఎమ్మెల్యేలు చ‌ప్ప‌ట్లు కొట్ట‌డం సిగ్గుచేటు. గ‌డిచిన రెండేళ్ల కూట‌మి పాన‌ల‌లో క‌ల్తీ అనేది సామాన్య విష‌యంగా మ‌రిపోయింది. ఏ వ్య‌వ‌స్థ మీదా ప్ర‌భుత్వ నియంత్రణ అనేది లేదు. నాడు వైయ‌స్ఆర్‌సీపీ పాల‌న‌లో పేద‌లకు ఉచితంగా నాణ్య‌మైన వైద్యం అందిస్తే నేడు వైద్యారోగ్య రంగం అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో క‌నీస సౌక‌ర్యాలు ఉండ‌టం లేదు. క‌ల్తీ పాల ఘ‌ట‌న‌పై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాలి. డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేయ‌కుండా, లంచాల మ‌త్తులో అధికారులు ప్ర‌జ‌ల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడ‌కుండా నిందితుల‌ను క‌ఠినంగా శిక్షించాలి. బాధితులందరికీ ఉచితంగా వైద్యం అందించాలి. ఇప్ప‌టికే ఆస్ప‌త్రులు తీసుకున్న ఫీజులు వెన‌క్కివ్వాలి.