ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మంత్రి లోకేష్ పచ్చి అబద్ధాలు
వెలగపూడి: వైయస్ఆర్‌సీపీ హయాంలో రూ.4 వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయన్న మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలపై ఎక్కడైనా, ఎప్పుడైనా బహిరంగ చర్చకు సిద్ధమని వైయస్సార్సీపీ ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పి.చంద్రశేఖర్‌రెడ్డి, కెఆర్‌జే భరత్ సవాల్ చేశారు. సభ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన వారు ఆక్షేపించారు.
ఈ సందర్భంగా ఎవరెవరు ఏమన్నారంటే..:
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.5600 కోట్లు చెల్లించాలి.
:వరుదు కళ్యాణి. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ
– 2014–19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం పెండింగ్ పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు రూ.1770 కోట్లు సహా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలోనూ ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు త్రైమాసికాల వారీగా డిసెంబర్ 2023 వరకు ఎప్పటికప్పుడు చెల్లించడం జరిగింది. చివరి త్రైమాసికం నిధులు ఎన్నికల కోడ్ వచ్చినా చెల్లించాలనుకున్నాం. కానీ తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి నిధులు చెల్లించనీయకుండా అడ్డు పడింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాల్సిన రూ.5600 కోట్ల బకాయిలు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వైయ్ససార్సీపీ హయాంలోనే రూ.4 వేల కోట్లు బకాయిలున్నాయని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారు. పేద విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ప్రత్యేక విమానాల కోసం, అమరావతి ఫెస్టివల్స్ పేరుతో వేల కోట్లు వృథా చేస్తున్న ప్రభుత్వం, పేద విద్యార్థుల చదువుల కోసం ఖర్చు చేయలేకపోవడం దుర్మార్గం. కనీసం ఇప్పుడైనా, ఎప్పటిలోగా ఫీజు బకాయిలు చెల్లిస్తారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
రెండేళ్లలో 10 శాతం నాడు–నేడు పనులు పూర్తి చేయలేదు.
:పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి. వైయస్ఆర్‌సీపీఎమ్మెల్సీ.
– దివంగత వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకొస్తే దాన్ని వైయస్ జగన్ గారు మరింత ముందుకు తీసుకెళ్లారు. దీంతోపాటు నాడు–నేడు (మనబడి) ద్వారా ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. అత్యాధునిక సౌకర్యాలతో కార్పొరేట్ స్కూళ్లకు థీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దారు. విద్యా రంగంలో దేశానికే ఏపీని మోడల్‌గా
తీర్చిదిద్దితే కూటమి ప్రభుత్వంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్.. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశాడు. నాడు–నేడు (మన బడి) కార్యక్రమానికి పేరు మార్చి మన బడి–మన భవిష్యత్తు అని నామకరణం చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ పథకం కింద ఎంత ఖర్చు చేశారని ప్రశ్నిస్తే
సూటిగా సమాధానం చెప్పలేకపోయింది. రూ.500 కోట్లు బకాయిలు చెల్లించడం మినహా ఒక్క స్కూల్‌ను కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదు. 90 శాతం పనులు పూర్తయిన బడులను కూడా రెండేళ్లుగా అలాగే వదిలేశారు. అతికొద్ది నిధులు వెచ్చిస్తే పనులు పూర్తవుతాయని తెలిసినా ఒక్క రూపాయి ఖర్చు చేయడం లేదు. డిజిటల్ బోర్డులు, ఎలక్ట్రిక్ సమస్యలు, ఆర్‌వో ప్లాంట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తినా వాటిని అలాగే మూలన పడేస్తున్నారే కానీ బాగు చేయించి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని ఆలోచించడం లేదు. ట్యాబ్‌లకు రిపేర్లు చేయడానికి కాంట్రాక్టు తీసుకున్న ఏజెన్సీని కూడా రద్దు చేశారు. దీంతో వేల కోట్ల విలువైన ప్రభుత్వ సంపద బడుల్లో మూలన పడిపోతోంది.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పచ్చి అబద్దాలు.
:కేఆర్‌జే భరత్. వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ.
– ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఎప్పటిలోపు చెల్లిస్తారని శాసన మండలిలో మంత్రి నారా లోకేష్‌ని అడిగితే కేవలం రూ.350 కోట్లు మాత్రమే పెండింగ్ ఉందని పచ్చి అబద్ధం చెప్పడం సిగ్గుచేటు. వైయస్ఆర్‌సీపీహయాంలో కరోనా కష్టకాలంలోనూ ఫీజు రీయింబర్స్‌మెట్ నిధులు త్రైమాసికాల ప్రకారం చెల్లిస్తే రూ.4 వేల కోట్లు బకాయిలు పెట్టామని నిస్సిగ్గుగా చెబుతున్నాడు. కూటమి అబద్ధాలకు హద్దే లేకుండా పోతోంది. సభలోనూ పచ్చి అబద్ధాలు చెబుతున్న ప్రభుత్వాన్ని నిరసిస్తూ సభ నుంచి వైయస్ఆర్‌సీపీ వాకౌట్ చేసింది.