విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది

13 Feb, 2026 14:41 IST

విజయవాడ:  విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింద‌ని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిప‌డ్డారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు శాసన మండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులు.. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బకాయిలు ఎందుకు చెల్లించడంలేదని సభ్యులు నిలదీశారు. దీంతో, వైయ‌స్ఆర్‌సీపీ సభ్యులకు సమాధానం చెప్పలేక మంత్రులు నారా లోకేష్‌, డోలా బాల వీరాంజనేయులు ఎదురుదాడికి దిగారు.

ఈ క్రమంలో మంత్రి లోకేష్‌.. గత వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో నాలుగు వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు. స్కూల్స్‌లో మౌళిక సదుపాయాలు లేవని.. కూటమి ప్రభుత్వంలో సదుపాయాలు కల్పిస్తున్నామని అన్నారు. ఆయన వ్యాఖ్యలపై మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోకేష్‌కు దమ్ముంటే బకాయిలు ఉన్నట్టు నిరూపించాలని బొత్స సవాల్‌ విసిరారు. గత టీడీపీ పాలనలో పాఠశాలను పట్టించుకున్న పరిస్థితే లేదన్నారు. దీంతో, మంత్రి లోకేష​ సమాధానం చెప్పలేక సైలెంట్‌ అయిపోయారు.


అనంతరం, మండలిలో బొత్స మాట్లాడుతూ..‘మేం మీలాగా ఈనాడు, ఎన్టీఆర్ భవన్ లెక్కలు చెప్పడం లేదు. విద్యావ్యవస్థను ఈ ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. ఈ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ మనుగడ సాగిస్తుందని ప్రజలకు విశ్వాసం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్ మెంట్ రెండు వాయిదాలు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడుతున్నాను. సత్యదూరమైన మాటలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మీకు వీలైతే అధికారులను పిలిపించండి.. ఇక్కడే వాస్తవాలు తేలుతాయి. ఈ ప్రభుత్వం వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్స్ కాలేజీలు వచ్చాయో లెక్కలు తీయండి. కొత్తగా ఒక్క ప్రభుత్వ జూనియర్ కాలేజీ తీసుకురాలేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ..‘కూటమి ప్రభుత్వంలో 8500 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలున్నాయి. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వం చెల్లించింది. ఇంకా 7800 కోట్లు ఫీజు బకాయిలున్నాయి. వైఎస్‌ జగన్ హయాంలో ఎప్పటి బకాయిలు అప్పుడే చెల్లించారు. కూటమి ప్రభుత్వంలో బకాయిలున్నాయి పేరుకుపోయాయని అన్నారు.