డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ వాస్తవం
తాడేపల్లి: డీఎస్సీలో జరిగిన అక్రమాలపై తాము సంధిస్తున్న ప్రశ్నలకు ప్రభుత్వ పెద్దలు సమాధానమివ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని, విద్యా శాఖ మంత్రి ఇప్పటి వరకు నోరు మెదపలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, వరుదు కల్యాణి ధ్వజమెత్తారు. డీఎస్సీ అక్రమాలపై తాము రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు చేస్తుంటే.. బైజూస్ ట్యాబ్ ల్లో అవినీతి అంటూ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు దిగుతోందని వారు ఆక్షేపించారు. డీఎస్సీలో అక్రమాలు ముమ్మాటికీ నిజమని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు.
ప్రెస్ మీట్లో వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే..:
డీఎస్సీ అక్రమాలు తేటతెల్లం:
:లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ
రాష్ట్రంలో విద్యాశాఖతో పాటు సకల శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ లేదా ఆయన తండ్రి చంద్రబాబు డీఎస్సీ అక్రమాలపై మాట్లాడతారని అనుకున్నాం. లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న వ్యవహారంలో ఓ స్పష్టత వస్తుందని భావించాం. కానీ ఇప్పటి వరకు విద్యా శాఖ మంత్రి నోరు మెదపలేదు. విద్యాశాఖ కార్యదర్శి మీడియాతో మాట్లాడినా విలేఖరుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారు. మాకు సమాధానం చెప్పకపోయినా ఫర్వాలేదు, లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధులకు, ప్రజలకు మాత్రం సమాధానం చెప్పాల్సిందే. మీరు మాట్లాడే పారదర్శకత ఎక్కడుంది? మెరిట్ లిస్ట్ ఎందుకు పదే పదే మార్చారని అడుగుతున్నాం, ఎక్కడైనా ఫలితాలు వచ్చాక పారదర్శకంగా ఎవరెవరు అర్హత సాధించారో జిల్లా కేంద్రాల్లో మార్కులతో సహా ప్రకటిస్తారు. కానీ ఇక్కడ మెసేజ్ ల ద్వారా కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చింది?
డీఎస్సీ కోసం ప్రత్యేకంగా కోటా తీసుకొచ్చారు. ఏపీలో ఎప్పుడూ వినని అత్యా, పత్యా వంటి క్రీడల్ని ఇందులో చేర్చారు. గూగుల్ లో కొడితే 9 మంది సభ్యులు ఉంటారని, ఆట ప్రాంతంలో ఓ కందకం ఉంటుందని వచ్చింది. టెన్ పిన్ బౌలింగ్ అని మరో క్రీడ. చెక్క మీద పిన్నులు అమరుస్తారట. ఇంకొకటి బ్రిడ్జి గేమ్ అట. ఇదో పేకాట లాంటి ఆట. టగ్ ఆఫ్ వార్ గేమ్ ను కూడా డీఎస్సీ స్పోర్ట్ కోటాలో పెట్టారు. బలంగా ఉన్న వారు ఓవైపు తాడు లాగేస్తే గెలిచే ఆట ఇది. ఇలాంటి ఆటలకు కూడా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? సభ్య సమాజానికి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వీళ్లు పీఈటీలుగా మాత్రమే పనిచేయరు, సెలెక్ట్ అయితే సబ్జెక్టులు కూడా చెప్తారట.
నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు:
మీకన్నా రాజకీయ అనుభవం తక్కువగా ఉన్న జగన్‌గారు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేస్తే రాష్ట్రంలో స్కూళ్ల రూపురేఖలే మారిపోయాయి, ప్రపంచంతో పోటీ పడాలని, ఆంధ్రప్రదేశ్ ను అక్షర క్రమంతో పాటు ఆభివృద్ధిలోనూ ముందుంచాలని ఇంగ్లీష్ విద్యను అమలు చేశారు. ఎన్నో సంస్కరణలు అమలు చేసి నేటి విద్యార్ధులే భవిష్యత్ ఆస్తి అని చెప్పి పాలన చేశారు. మీరు మాత్రం డీఎస్సీలో ఉద్యోగాలు ఇవ్వడానికి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారా? మాట్లాడితే కేసులు పెడతారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంతృత్వంలో ఉన్నామా? కాపీలు ఎక్కడా జరగవంటున్నారు, ఈ మధ్య జరిగిన నీట్ లో కాపీలు జరిగాయనే కదా పరీక్షలు రద్దు చేసింది. అక్కడా సీబీటీయే కదా. తప్పు జరిగింది, దాన్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించండి, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుకోవద్దు.
ముఖ్యమంత్రి బాధ్యత తీసుకుంటారా లేక విద్యామంత్రి బాధ్యత తీసుకుంటారా చెప్పండి. తప్పనిసరిగా రాజీనామా చేయాల్సిందే. ఈ రాష్ట్రంలో జరిగిన పెద్ద కుంభకోణంగా దీన్ని భావిస్తున్నాం. అధికారం ఉందని మేం ఏ విధంగా చెప్పినా ముందుకు సాగుతుందని అనుకుంటే సరికాదు. ప్రజాస్యామ్యంలో ప్రజల గొంతుకగా ప్రజల కోసం ఉద్యమించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిద్దంగా ఉంది. ఎమ్మెల్సీలు వెళ్లి విద్యాశాఖ కమిషనర్ ను కలిశాం, రాష్ట్రంలో అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు ఇచ్చాం, రేపు ఛలో కలెక్టరేట్ నిర్వహించబోతున్నాం.
‘బైజూస్’ పేరుతో డైవర్షన్ పాలిటిక్స్.
:పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ
జగన్‌గారు విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్స్ ఇస్తే అందులో అవినీతి జరిగిందని వార్తలు రాయిస్తున్నారు. విద్యా రంగంలో ఎన్నో సంస్కరణలు చేసిన వ్యక్తి.. బైజూస్ ట్యాబ్స్ విషయంలో అవినీతి చేశాడని చెప్తారా ?, డీఎస్సీ అక్రమాలు బయటపడుతుంటే తట్టుకోలేక, వాటిని డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆరోపణలతో బురద జల్లే యత్నం చేస్తున్నారు. ప్రపంచ స్దాయిలో నాణ్యమైన విద్య అందించేందుకు 8వ తరగతి పిల్లలకు ఉచితంగా ట్యాబ్స్ ఇస్తే.. ఈ ప్రభుత్వం దాన్ని కూడా నాశనం చేసింది. ట్యాబులు ఇవ్వకపోగా.. మళ్లీ మాపై బురద జల్లుతున్నారు. మా మీద చేస్తున్న కక్షపూరిత రాజకీయాల్ని పిల్లల మీద కూడా చేస్తున్నారు. జగనన్నలా ట్యాబులు ఎందుకు ఇవ్వడం లేదని పిల్లలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పలేక ఇలా బురద జల్లుతున్నారు. కోవిడ్ లాంటి సమయాల్లో ఈ ట్యాబులు పిల్లలకు ఎంతో ఉపయోగపడ్డాయి. ఇప్పుడు వాటిని ఇవ్వకపోగా.. అవినీతి అంటూ బురద జల్లడం మీకే చెల్లింది.
ఒక్క నవీన్ విషయంలోనే ఎన్నో అనుమానాలు:
వెబ్ సైట్ లో ఆగస్టు 26న అతని పేరు మెరిట్ లిస్ట్ లో నుంచి తొలగించాక, అతని లాగిన్ కూడా బ్లాక్ చేశారు. సెప్టెంబర్ 2న సర్టిఫికెట్ల ధవీకరణ ఉంది. అతని పేరు ముందుగా బ్లాక్ చేశాక కూడా అతనికి కాల్ లెటర్ ఎలా పంపించారు. ఏ విధంగా అతను సెప్టెంబర్ 2 సర్టిఫికెట్ల ధవీకరణకు వచ్చే అవకాశం ఉంటుంది ? నా లాగిన్ బ్లాక్ చేశారు, నాకు కాల్ లెటర్ రాలేదని మీ దగ్గరికి వచ్చాక అతను కోర్టుకు కూడా వెళ్లాడు. మీరు వ్యూహాత్మకంగా బెదిరించి పక్కనబెట్టారా, అతను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం రాలేదా ఇందులో ఏది నిజమో చెప్పాలి. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు రాలేదని అంటే అతని లాగిన్ ఎందుకు బ్లాక్ చేశారో, అతని ఫస్ట్ ర్యాంక్ ను ఎందుకు డిలీట్ చేశారో చెప్పాలి. ఇది ఆ ఒక్క వ్యక్తికే పరిమితం కాలేదు. ఆ ప్రశ్నాపత్రం కోచింగ్ సెంటర్లకు వెళ్లింది. ఒక్క వ్యక్తిని తొలగిస్తే సమస్య పరిష్కారం కాదు. సమగ్రంగా విచారణ జరిపించాలి. అందులో ఈ వ్యవహారం ఒక్కరికే పరిమితం అయిందా లేక చాలా మందికి వెళ్లిందా అనేది తేల్చాలి. ఇది వైఎస్సార్సీపీ డిమాండ్ మాత్రమే కాదు కొన్ని లక్షల మంది నిరుద్యోగుల కోరిక.
డీఎస్సీపై సీబీఐ దర్యాప్తు జరిపించాల్సిందే:
లక్షా 36 వేల ఉద్యోగాలు ఒకేసారి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. 3.50 లక్షల మందికి పరీక్షలు సక్రమంగా నిర్వహించలేక అక్రమాలకు పాల్పడ్డారు. డీఎస్సీలో ప్రతిసారీ మెరిట్ లిస్ట్ ప్రకటిస్తారు. అందరి మార్కుల్నీ వెల్లడిస్తారు. మొదటి మార్కు నుంచి చివరి మార్కు వరకూ పాసైన అందరి వివరాలు ఇందులో ఉంటాయి. వర్టికల్, హారిజాంటల్ రిజర్వేషన్ సిస్టమ్ ల ప్రకారం సెలెక్షన్ లిస్ట్ తయారు చేయాలి. ఆ తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఉద్యోగాల భర్తీ ఉంటుంది. కానీ అభ్యర్ధులకు కాల్ లెటర్స్ వ్యక్తిగతంగా పంపించారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత కూడా వందల మందికి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఎందుకని ప్రశ్నిస్తే మీ ఉద్యోగాల్ని స్పోర్ట్స్, పీహెచ్ కోటా కింద ఇచ్చామని అధికారులు చెప్పారు. నిన్న కోన శశిధర్ కూడా 1:1లో ఉద్యోగాలు ఇచ్చామన్నారు. హారిజాంటల్ రిజర్వేషన్ పద్ధతి ప్రకారం కొత్తగా స్పోర్ట్స్, పీహెచ్, మహిళా కోటాలో ఇవ్వాల్సి వచ్చింది కాబట్టి కొందరిని తొలగించామన్నారు. కాల్ లెటర్స్ పంపాక ఈ కోటాలు కొత్తగా ఎందుకు అమలు చేసారు. ఈ విషయం కాల్ లెటర్స్ పంపక ముందు చూసుకోలేదా? హారిజాంటల్ కేటగిరీలో చూసుకుంటే ఉదాహరణకు కడపలో ఉర్దూ పోస్టులు 3 ఉంటే, ఇందులో మొదటి పోస్టు మహిళకు ఇవ్వాలి. రోస్టర్ పాయింట్స్ 58–75–83 లో ఎస్టీలకు ఇవ్వాలి. ఓ అమ్మాయిని, ఇద్దరు అబ్బాయిల్ని పిలిచారు. వీరికి ఉద్యోగాలు ఇచ్చేయాలి. కానీ మెరుగైన ర్యాంక్ ఉన్న అమ్మాయిని కాస్తా 58లో ఇవ్వకుండా 75లో ఇచ్చేశారు.
మహిళా రిజర్వేషన్ ప్రకారం కాకుండా జనరల్ లో ఇవ్వాలని భావించారు. దీని వల్ల ఇద్దరు అబ్బాయిల్లో ఒకరు మిగిలిపోయారు. ఇది హారిజాంటల్ సిస్టమ్ కు వ్యతిరేకం. దీని మీద సదరు ఎస్టీ అభ్యర్ధి ప్రశ్నించినా ఫలితం లేక కోర్టుకు వెళ్లాడు. స్పోర్ట్ కోటాలో కూడా గోల్డ్ మెడల్ వచ్చిన వారికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. అందుకే సీబీఐ దర్యాప్తు జరిగి వాస్తవాలు బయటికి రావాలి. ఇలాంటి తప్పులు పునరావతం కాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం.
డీఎస్సీ కాదు ముమ్మాటికీ దగా డీఎస్సీ.
:వరుదు కల్యాణి, ఎమ్మెల్సీ
ఎంతో పారదర్శకంగా చేపట్టాల్సిన డీఎస్సీని ఇవాళ దగా డీఎస్సీగా మార్చేశారు. నిరుద్యోగుల తరఫున వైఎస్సార్సీపీ ముందు నుంచీ చాలా ప్రశ్నలు అడుగుతోంది. స్పోర్ట్స్ కోటాను తీసుకుంటే 2012లో ఓ జీవో విడుదల చేశారు. 29 క్రీడలకు 2 శాతం రిజర్వేషన్ కల్పించారు. 2025 ఏప్రిల్ 18న ఇంకో 36 గేమ్స్ కలిపి మొత్తం 65 క్రీడలకు అవకాశం కల్పిస్తూ జీవో ఇచ్చారు. ఈసారి డీఎస్సీలో 421 మందికి స్పోర్ట్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చారు. 2026 మేలో టెట్, డీఎస్సీ లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన వారికి పరీక్ష పెట్టాలని మళ్లీ ఇంకో జీవో ఇచ్చారు. పాత జీవోను రద్దు చేశారు. ఇన్ని మార్పులు ఎందుకు చేస్తున్నారు? అక్రమాలు జరిగినందుకేగా?, టెట్, డీఎస్సీ లేకుండా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంటి ? ఈ కోటాలో ఇచ్చిన ఉద్యోగాల్లో క్రీడల అర్హతల ప్రాతిపదిక కూడా మార్చేశారు. మెడల్స్ కొట్టిన వారికి కాకుండా ఛాంపియన్ షిప్ లో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇచ్చారు. డీఎస్సీ పేపర్ తయారీలో భాగమైన వ్యక్తికే ఫస్ట్ ర్యాంక్ రావడం.. అయినా ఆయన ఉద్యోగానికి ఎంపిక కాకపోవడం ఆశ్చర్యం కలగిస్తోంది. మీడియాతో విద్యా శాఖ కార్యదర్శి మాట్లాడినా, సూటిగా వేటికీ సమాధానం చెప్పలేదు.
అందుకే సీబీఐ విచారణ కోరుతున్నాం.