మహానేత వైయస్‌ఆర్ విగ్రహం తొలగింపు దుర్మార్గం
విశాఖ: పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని పెందుర్తి జంక్షన్ వద్ద అభివృద్ధి పేరుతో దివంగత ముఖ్యమంత్రి, మహానేత డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించి కాలువలో పడేయడంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నాయకుడి విగ్రహాన్ని ఈ విధంగా అవమానకరంగా తొలగించడం ప్రజల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని పార్టీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం సంఘటన స్థలాన్ని మాజీ మంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్ , మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ పరిశీలించారు. “రోడ్డు వైడెనింగ్” పేరిట మహానేత వైయస్‌ఆర్ గారి విగ్రహాన్ని తొలగించడం ప్రజలపై దాడి చేసినట్లేనని వారు తీవ్రంగా ఖండించారు. ప్రజల ఆరాధ్య నాయకుడిని అవమానించడం ద్వారా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గాయం చేసినట్లేనని వారు వ్యాఖ్యానించారు. తక్షణమే డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాన్ని యథాస్థానంలో పునఃస్థాపించడంతో పాటు, ఈ ఘటనకు బాధ్యులైన జివిఎంసీ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ప్రజల భావోద్వేగాలను గౌరవించి, ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా స్పష్టమైన చర్యలు చేపట్టాలని పార్టీ నాయకులు కోరారు.