చంద్ర‌బాబు నియంత‌లా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు 

8 Nov, 2025 15:45 IST

తాడేప‌ల్లి:   ఏడాదిన్నర పాలనలో అన్నింటా ఘోరంగా విఫలమైన సీఎం చంద్రబాబు, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు పెట్టి గొంతు నొక్కాలని చూడడం నియంతృత్వ పోకడలకు నిదర్శనమని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, పెనమలూరు నియోజకవర్గం పార్టీ ఇంఛార్జ్‌ దేవభక్తుని చక్రవర్తి స్పష్టం చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏడాదిన్నరగా రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగుతోందని, సీఎం చంద్రబాబుకు రాజ్యాంగంపైనా, ప్రజాస్వామ్యంలపైనా ఏ మాత్రం గౌరవం లేదని వారు తేల్చి చెప్పారు.
తండ్రి అంత్యక్రియల కోసం లండన్‌ నుంచి వచ్చిన ఎన్నారై భాస్కర్‌రెడ్డిని ముందుగానే అరెస్ట్‌ చేసి కొట్టడమే కాకుండా, ఆ తర్వాత అక్రమ కేసులు నమోదు చేసి మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపర్చారని తెలిపారు. సీఎం చంద్రబాబు తన ప్రతీకార రాజకీయాలకు పోలీస్‌ వ్యవస్థను పావుగా వాడుకుంటున్నాడని, అయితే న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పని చేస్తోంది కాబట్టి, అన్నిసార్లు ఆయన ఆటలు సాగడం లేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన గోరంట్ల మాధవ్, దేవభక్తుని చక్రవర్తి చెప్పారు.
ప్రెస్‌మీట్‌లో వారింకా ఏం మాట్లాడారంటే..:

ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్నారు:
    ఒక్క మాటలో చెప్పాలంటే, రాష్ట్రంలో కూటమి పాలన చంద్రబాబు లండన్‌కి, నారా లోకేష్‌ ముంబైకి జోగి రమేష్‌ అన్యాయంగా జైలుకు అన్నట్లుగా ఉంది. ప్రజాపాలన సాగించాలంటే చంద్రబాబు మొదటగా రాజ్యాంగాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి. రాజ్యాంగం అర్థమైతేనే ప్రజాస్వామ్యం గొప్పతనం చంద్రబాబుకి అర్థం అవుతుంది. అది అర్థం కావాలంటే ఫ్రెంచ్‌ విప్లవం గురించి తెలుసుకోవాలి లేదా జాన్‌ డియో రాసిన డెమోక్రసీ అండ్‌ ఎడ్యుకేషన్‌ అనే పుస్తకాన్ని చదవాలి. భారత రాజ్యాంగాన్ని రాసిన బీఆర్‌ అంబేడ్కర్‌ సైతం ఫ్రెంచ్‌ విప్లవం, జాన్‌ డియో పుస్తకం నుంచే స్ఫూర్తి పొందారు. ఒక మనిషి ఆలోచనను నియంత్రించాలనుకోవడాన్ని మించిన క్రూరత్వం మరొకటి ఉండదు. ఇది నియంత ఆలోచనలకు నిదర్శనం.
    సీఎం చంద్రబాబు తననెవరూ మీడియాలో విమర్శించకూడదు, తన వైఫల్యాల గురించి పత్రికల్లో రాయకూడదు, డిబేట్లలో తన గురించి వ్యతిరేకంగా విశ్లేషించకూడదు అని కోరుకుంటాడు. ఇంకా తన  ఏడాదిన్నర అసమర్థ పాలనను ప్రశ్నించే గొంతులను కూడా ఆయన సహించడం లేదు. అడ్డగోలుగా కేసులు పెట్టి, వారిని అరెస్టు చేస్తున్నారు.
    సంపద సృష్టిస్తా. ఆదాయం పెంచుతా. దాన్ని ప్రజలకు పంచుతా అన్ని ఎన్నికల ముందు, ఆ తర్వాత చెప్పిన ఈ పెద్దమనిషి వారం వారం అప్పులు చేస్తూ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చేశాడు. రాయలసీమ ప్రజల కోసం, గంటకు 350 కి.మీల స్పీడ్‌తో నడిచే బులెట్‌ ట్రైన్‌ తెస్తానని చెప్పిన చంద్రబాబు ఆ హామీని విస్మరించి ఆయన.. ఆయన కొడుకు స్పెషల్‌ ఫ్లైట్స్‌లో తిరుగుతున్నారు.  

బస్సు ప్రమాదంపై ప్రశ్నిస్తే 27 మందిపై అక్రమ కేసులు:
    కర్నూలు బస్సు ప్రమాదంపై పారదర్శకంగా విచారణ జరిపి ప్రజలకు వాస్తవాలను తెలియజేయాలని డిమాండ్‌ చేసినందుకు వైయ‌స్ఆర్‌సీపీకి చెందిన 27 మందిపై కూటమి ప్రభుత్వం కేసులు పెట్టింది. బస్సు ప్రమాదం వెనుక ఉన్న అనుమానాలను విశ్లేషిస్తూ వార్తలు ప్రచురించిన సాక్షి మీద కేసులు పెట్టారు. పౌరుల భావప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారందరిపై అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతున్నారు.
    విశాఖపట్నంలో కొండారెడ్డి అనే విద్యార్థి అరెస్ట్‌ విషయంలోనూ పోలీసులు ఎన్నో కుట్రలకు పాల్పడ్డారు. ఎఫ్‌ఐఆర్‌ లో పోలీసులు అరెస్ట్‌ చూపించిన సమయానికి, సీసీ టీవీ ఫుటేజ్‌ ప్రకారం అదుపులోకి తీసుకున్న సమయానికి తేడా ఉంది. పైగా కొండారెడ్డిని అక్రమంగా డ్రగ్స్‌ కేసులో అరెస్ట్‌ చేసినట్టు చూపించి విద్యార్థి జీవితాన్ని నాశనం చేయడానికి కూడా వెనుకాడటం లేదు. కొండారెడ్డిని నవంబర్‌ 2వ తేదీ సాయంత్రం 5.40కి పోలీసులు అరెస్ట్‌ చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంటే, ఉదయం 11.40కే కొండారెడ్డిని అరెస్ట్‌ చేసినట్టు తెలుగుదేశం అధికార ఎక్స్‌ హ్యాండిల్‌ నుంచి పోస్టు చేశారు.
    ఇదంతా చూస్తుంటే టీడీపీ సోషల్‌ మీడియా చెప్పింది కాబట్టి కొండారెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేసినట్టుగా ఉంది. పోలీసుల భుజాల మీద తుపాకులు పెట్టి చంద్రబాబు వైయ‌స్ఆర్‌సీపీలో ఉన్న తన టార్గెట్‌లను చేదించుకుంటూ పోతున్నాడు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చాక సీఎం చంద్రబాబు తీరుతో పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిపోయిందని మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ చెప్పారు.

ఎం.భాస్కర్‌రెడ్డి అక్రమ అరెస్ట్‌: దేవభక్తుని చక్రవర్తి
– నవంబరు 1న, మాలపాటి భాస్కర్‌రెడ్డి తండ్రి చనిపోతే రెండో తేదీన లండన్‌ నుంచి విజయవాడకు వచ్చాడు. నవంబర్‌ 6న అతడు తన అన్న ఓబుల్‌రెడ్డితో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం కామినేని ఆస్పత్రికి వెళితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని భాస్కర్‌రెడ్డి సోదరుడు పోలీసులను అడిగినా సమాధానం చెప్పకుండా పక్కకు తోసేసి వెళ్లిపోయారు. అప్పటివరకు అతడి మీద ఏ కేసూ లేదు. 
    ఎప్పుడో పదేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టింగ్‌ను చూపించి అక్రమంగా అరెస్ట్‌ చేశారు. అతణ్ని గన్నవరం డీఎస్పీ ఆఫీసులో నిర్బంధించి అతి దారుణంగా కొట్టి వేధించారు. నడవలేని స్థితిలో ఉన్న భాస్కర్‌రెడ్డి.. పోలీసులు తనపై వ్యవహరించిన తీరును జడ్జికి వివరించాడు. 
    కాగా, అంతకు ముందే భాస్కర్‌రెడ్డి బంధువులు హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ వేయడంతో స్పందించిన పోలీసులు, అప్పటికప్పుడు కేసులు నమోదు చేసి, జడ్జి ముందు ప్రవేశపెట్టారు. భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేయాలని ముందుగా నిర్ణయించి దాని ప్రకారం తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపినట్టు ఎవరికైనా స్పష్టంగా తెలిసిపోతుంది.
    తండ్రి చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వ్యక్తిని అక్రమ కేసులో దుర్మార్గంగా అరెస్ట్‌ చేశారు. తనను ఇద్దరు సీఐలు, ఒక ఎస్సై తీవ్రంగా కొట్టారని భాస్కర్‌రెడ్డి మేజిస్ట్రేట్‌ ముందు చెబితే పోలీసులకు షోకాజ్‌ నోటీసులిచ్చి అతడిని వైద్యపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. న్యాయ వ్యవస్థ లేకపోతే ఈ పోలీసుల ఆగడాలు ఎలా ఉండేవో చెప్పడానికి భాస్కర్‌రెడ్డి కేసు ఒక ఉదాహరణ.
   వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, సానుభూతిపరులే టార్గెట్‌గా పోలీసులు ఒక వికృతమైన సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. పోలీస్‌ కానిస్టేబుల్‌ని కొట్టాడంటూ అతడిపై తప్పుడు కేసు పెట్టారు. భాస్కర్‌రెడ్డిని ఎప్పటికీ లండన్‌ వెళ్లనీయకుండా చేయాలని కొందరు టీడీపీ వ్యక్తులు లక్ష్యంగా పెట్టుకుని ఇలాంటి తప్పుడు కేసులో ఇరికించారని, అయితే భాస్కర్‌రెడ్డి కుటుంబానికి వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుందని దేవభక్తుని చక్రవర్తి చెప్పారు.