స్పీకర్‌పై వైయస్ఆర్‌సీపీ నేతల ఫిర్యాదు
నెల్లూరు: అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ వేదాయపాళెం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల అయ్యన్నపాత్రుడు అనకాపల్లి, దొండపూడి గ్రామంలో ఓ సిఐ, ఎస్ఐని నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఎస్స్కార్ట్ ఆలస్యంపై పరుష పదజాలం ఉపయోగించడంతో స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్ధన్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`రాజ్యాంగ వ్యవస్థలో ఉన్నత స్థానంలో వున్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావు. అయ్యన్నపాత్రుడి వ్యాఖ్యలపై పోలీస్ అసోసియేషన్ స్పందించకపోవడం బాధాకరం. మా పార్టీకి, నాయకులకు పోలీసులపై గౌరవ మర్యాదలు వున్నాయి. సభ్యసమాజం తల దించుకునేలా అయ్యన్నపాత్రుని తీరు ఉంది. పోలీసుల పరిస్థితే ఇలా వుంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి అని` వారు ఆందోళన వ్యక్తం చేశారు.