రాష్ట్రంలో ఆటవిక పాలన కొనసాగుతోంది
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతున్న ఆటవిక పాలనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ప్రతినిధి బృందం జాతీయ మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. జాతీయ మానవ హక్కుల సంఘం చైర్‌పర్సన్ జస్టిస్ సుబ్రమణ్యంను కలిసిన నేతలు, రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులు, అలాగే సాల్మన్ రాజు హత్యకు సంబంధించిన అంశాలను కమిషన్ ముందు వివరించారు. టీడీపీ నేతలు రాజకీయ ప్రత్యర్థులను భౌతికంగా అంతమొందించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ, దానికి సంబంధించిన వీడియోలు, ఫోటో ఆధారాలను చైర్‌పర్సన్‌కు ప్రదర్శించారు. సాల్మన్ రాజు హత్య వెనుక ఉన్న రాజకీయ కుట్రను కూడా నేతలు వివరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కమిషన్‌ను కోరారు.
ఈ ప్రతినిధి బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పీవీ మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి పాల్గొన్నారు. అలాగే ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్ రావు కూడా ఈ బృందంలో ఉన్నారు.