వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ ది ప్రభుత్వ హత్యే
పల్నాడు: పల్నాడు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని.. వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని ఆయన తేల్చి చెప్పారు. పిన్నెల్లి గ్రామంలో 18 నెలలుగా దాదాపు 200 కుటుంబాలు ఊరికి దూరంగా బ్రతుకుతున్నాయని... భార్య ఆరోగ్యం సరిగా లేకపోవడంతో గ్రామానికి వచ్చిన సాల్మన్ ను టీడీపీ నేతలు కొట్టి చంపినా తిరిగి బాధితులపై కేసు నమోదు చేసిన పోలీసు తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సాల్మన్ హత్యతో పాటు పోలీసుల వైఖరిని నిరసిస్తూ నరసరావుపేట లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి విడుదల రజిని, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు టీజేఆర్ సుధాకర్ బాబు, నంబూరు శంకర్రావు, కాసు మహేష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి, పూనూరు గౌతమ్ రెడ్డి, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ నేతలు.
ఈ సందర్బంగా ఇంకా ఏమన్నారంటే...
● కాసు మహేష్ రెడ్డి - గురజాల మాజీ ఎమ్మెల్యే.
పల్నాడులో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది. రెడ్ బుక్ వల్లే గ్రామాల్లో హత్యలు జరుగుతున్నాయి. పిన్నెల్లి గ్రామంలో 18 నెలల నుంచి 200 కుటుంబాల నుంచి ఊరు నుంచి తరిమేశారు. నాయకులు, కార్యకర్తలు, చిన్నపిల్లలను సైతం ఊరు నుంచి తరిమేశారు. మహిళలను సైతం ఊరు నుంచి తరిమేసి దుర్మార్గంగా వ్యవహరించారు. పిల్లల చదువులు ఆగిపోయాయి. భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోతే పిన్నెల్లి వచ్చిన వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ ను ఊర్లోకి వచ్చినందుకు కొట్టి చంపారు. కేసు కట్టమని చెపితే.. తిరిగి కోమాలో ఉన్న సాల్మన్ మీద 324 కేసు పెట్టారు. కొట్టిన వాళ్లను వదిలేశారు. పరిస్ధితి సీరియస్ గా ఉందని తెలిసి వాళ్ల మీద 342 కేసు పెట్టారు. సాల్మన్ చనిపోవడంతో ఇప్పుడు కేసును 302 గా మారుస్తామని చెబుతున్నారు. దీనికంతటికీ కారణమైన సీఐ,ఎస్ ఐ లను ప్రభుత్వం సస్పెండ్ చేయాలి. సాల్మన్ కుటుంబాన్ని ఆదుకోవాలి.
అత్యంత దారుణమేమిటంటే... చనిపోయిన మృతిదేహాన్ని అంతిమ సంస్కారం కోసం గ్రామంలోకి తీసుకుని రావద్దని చెప్పారు. ఇదేమైనా మీ జాగీరా? సొంత ఊరు వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు పెట్టారు. ఓ దళితుడ్ని చంపి.. కడచూపుకు కూడా కుటుంబసభ్యులను నోచుకోకుండా చేయాలనుకోవడం దుర్మార్గం. మృతదేహాన్ని గ్రామంలోకి అంగీకరించకపోతే వైయస్.జగన్ నేరుగా వస్తారని చెప్పడంతో అప్పుడు అంగీకరించడంతో అప్పుడు సాల్మన్ గారికి ఘనంగా నివాళులర్పించాం. ఆయన హత్యకు నిరసనగా ప్రతి జిల్లా కేంద్రంలో ఇవాళ నిరసన తెలియజేయడంతో పాటు ఆయనకు ఘనంగా నివాళులర్పించాం.
● గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి - మాజీ ఎమ్మెల్యే, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్.
గురజాల నియోజకవర్గం మాచవరం మండలం పిన్నెల్లిలో వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నాయకులు తీవ్రంగా కొట్టడంతో ఆయన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ఇధి మున్మూటికీ ప్రభుత్వ హత్యే. టీడీపీ నేతల దాడిలో సాల్మన్ చనిపోతే.. పోలీసులు దుర్మార్గంగా అతని కుటుంబంపై కేసులు నమోదు చేసారు. కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేయడం దారుణం. చనిపోయిన సాల్మన్ మృతదేహాన్ని పిన్నెల్లి గ్రామంలోకి రానివ్వకుండా.. అంతిమ సంస్కారాలు కూడా అందకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇది అమానవీయం. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ సాల్మన్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సాల్మన్ హత్య కేసులో నిందితులను 24 గంటలలోగా అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కేసు నమోదులో తాత్సారం చేయడంతో పాటు బాధితులపై కేసు నమోదు చేయడానికి ప్రయత్నించిన పోలీసధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
● విడదల రజిని - మాజీ మంత్రి.
వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్ ను టీడీపీ నేతలు అత్యంత దారుణంగా కొట్టారు. దీంతో అతను కోమాలోకి వెళ్తే... సాల్మన్ బంధువులు పోలీసులకి ఫోన్ చేసినా స్పందించలేదు. పైగా ఊరిలోకి ఎవరు తిరిగి రమ్మన్నారు అని మాట్లాడ్డం బాధాకరం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు కావటం లేదు, లోకేష్ రాసిన రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది. పోలీసులు లా అండ్ ఆర్డన్ ను పూర్తిగా గాలికొదిలేశారు. తన భార్య ఆరోగ్యం సరిగ్గా లేదని ఇంటికి తిరిగి వచ్చిన దళిత కార్యకర్తను హత్య చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. వైయస్ఆర్‌సీపీ తరపున మా పార్టీ అధ్యక్షుడు వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారికి తన సంతాపం తెలియజేయడంతో పాటు, కుటుంబసభ్యులకు పార్టీ తరపున రూ.5 లక్షలు నష్టపరిహారం ప్రకటించారు. సాల్మన్ కుటుంబసభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ కార్యకర్తలకు జోలికొస్తే....వదిలిపెట్టేది లేదు. చట్టం ముందు దోషులుగా నిలబెడతాం.
● బొల్లా బ్రహ్మనాయుడు - మాజీ ఎమ్మెల్యే.
పిన్నెల్లి గ్రామంలో వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య దారుణం. ఇంత జరిగినా స్థానిక ఎమ్మెల్యే కనీస మానవత్వంతో వ్యవహరించకపోవడం దారుణం. పల్నాడు నాయకులందరూ ఆ కుటుంబం పట్ల కనీస మానవత్వంతో వ్యవహరించలేదు. మనుషులను పశువులు కన్నా హీనంగా చూస్తున్నారు. పోలీసు వ్యవస్థ పనీతీరు రాష్ట్రంలో అత్యంత దారుణంగా ఉంది. ఈ విధమైన వ్యవస్థ ఉన్నంత కాలం సాల్మన్ లాంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి. కూటమి పాలనను ప్రజలు చీత్కరించుకుంటున్నారు. దీన్ని వైయస్ఆర్‌సీపీ తరపున పూర్తిగా ఖండిస్తున్నాం. మీ పద్దతి మార్చుకోవాలని హెచ్చరిస్తున్నాం.
● గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి - సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త
ఎన్నికల తర్వాత గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామం నుంచి వైయస్ఆర్‌సీపీకి చెందిన 200 కుటుంబాలు గ్రామం వదిలివెళ్లిపోయాయి. 18 నెలలుగా వీళ్లంతా తమ పొలాలు, ఊరు వదిలిపెట్టి కూలీపనులు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. ఏ ప్రభుత్వమూ ఈ స్ధాయిలో కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన దాఖలాలు లేవు. చివరకు సంక్రాంతి పండగకు కూడా సొంత గ్రామానికి రాలేని పరిస్థితి. చివరకు కుటుంబ సభ్యులకు ఆరోగ్యం సరిగ్గాలేకపోతే ఇంటికి వచ్చిన సాల్మన్ ను టీడీపీ నేతలు రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సాల్మన్ చనిపోయారు. చివరకు మృతదేహానికి అంతిమ సంస్కారానికి కూడా గ్రామంలోకి రానివ్వకపోవడం దారుణం. ఇది అత్యంత దుర్మార్గం. పోలీసుల నిర్లక్ష్యమే సాల్మన్ ప్రాణాలను హరించింది. ఇది ముమ్మూటికీ శాంతిభద్రతల వైఫల్యమే. టీడీపీ కార్యకర్తలు అంతర్గత కుమ్ములాటలో ఒకరినొకరు చంపుకుంటే.. దాన్ని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అక్రమ కేసు నమోదు చేయడం రెడ్ బుక్ దాష్టీకానికి నిదర్శనం. దాచేపల్లి ఎస్ఐ, సిఐ ఇద్దరిపై చర్యలు తీసుకోవాలి. సాల్మన్ కుటుంబానికి వైయస్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. వారికి న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తాం.
● సుధాకర్ బాబు - వైయస్ఆర్‌సీపీ మాజీ ఎమ్మెల్యే, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు.
వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ ను తెలుగుదేశం పార్టీ గుండాలు చేత, పోలీసులను కాపలా పెట్టి.. సీఎం చంద్రబాబు నాయుడే కొట్టి చంపించాడు. చంద్రబాబు దళిత వ్యతిరేక వ్యవహారశైలికి ఇదే నిదర్శనం. మా మీద అనేక ప్రాంతాల్లో చంద్రబాబు దాడులు చేస్తూనే వచ్చాడు. ఎన్నికల్లో గెలిచిన టీడీపీ గురజాలలో వైయస్.జగన్ కన్నా ఎక్కువ మేలు చేస్తే సంతోషించేవాళ్లం. కానీ విపరీతమైన అరాచకాలు చేస్తున్నారు. పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. కర్నూలు జిల్లాలో మా ఆడపడుచులపై అత్యాచారం చేసే ప్రయత్నం చేశారు. అక్కడ కూడా గ్రామ బహిష్కరణ చేస్తున్నారు. ప్రభుత్వం మందా సాల్మన్ కి రూ.1 కోటి ఎక్స్ గ్రేషియాతో పాటు ఎకరం పొలం ఇవ్వాలి. ఈ హత్యకు కారణమైన స్థానిక ఎస్ఐ, సిఐలతో పాటు ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దీనిపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ను కలిసి ఫిర్యాదు చేస్తాం. చంద్రబాబు హయంలో ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దమనకాండపై సాక్ష్యాధారాలతో సహా జాతీయ స్ధాయిలో ఆందోళన చేస్తాం.
● నంబూరి శంకరరావు - మాజీ ఎమ్మెల్యే.
వైయస్ఆర్‌సీపీ దళిత సోదరుడిపై జరిగిన దాడి దారుణం. టీడీపీ నేతల దాడిలో తీవ్ర గాయాలపాలై న సాల్మన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వెనుక పోలీసుల నిర్లక్ష్యం ఉంది. అధికార పార్టీ గూండాయిజానికి ఇదే నిదర్శనం. ప్రభుత్వం తక్షణమే హత్య చేసిన వాళ్లను శిక్షించడంతో పాటు సాల్మన్ కుటుంబానికి న్యాయం చేయాలి. దాడి చేసి చంపడమే కాకుండా... మరలా బాధితులపైనే కేసులు నమోదు చేయడం, మృత దేహాన్ని గ్రామంలోకి రానివ్వకపోవడం అత్యంత అమానుషం. దీన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా ఖండిస్తోంది.
● గౌతమ్ రెడ్డి - వైయస్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియన్ నేత.
పల్నాడు జిల్లాలో అధికార పార్టీ రౌడీయిజం, గూండాయిజం పెచ్చుమీరుతుందనడానికి నిదర్శనం వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్త సాల్మన్ హత్య. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్నాడు జిల్లాలో 8 మందిని హత్య చేయడంతో పాటు వందలాది మందిని క్షతగాత్రులను చేశారు. జిల్లాలో జరుగుతున్న రౌడీయిజంపై వైయస్ఆర్‌సీపీ కచ్చితంగా పోరాటం చేస్తుంది. శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం పోలీసుల వలనే జరగడం అత్యంత దారుణం. సాల్మన్ మృతదేహం వద్దకు అతని కుటుంబసభ్యులను సైతం మూడు గంటలపాటు రానివ్వకపోవడం, వందలాది మంది పోలీసులను మొహరించడం అత్యంత దుర్మార్గం. కచ్చితంగా అధికార పార్టీ దీనికి తగిన మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇది ముమ్మూటికీ ప్రభుత్వ హత్యే. సీఎం చంద్రబాబు నాయుడే దీనికి బాధ్యత వహించాలి.