పండగలోపు షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు చెల్లించాల్సిందే
చోడవరం: చోడవరం సహకార షుగర్ ఫ్యాక్టరీ రైతుల బకాయిల అంశంపై వైయస్ఆర్‌సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పండగలోపు రైతులకు బకాయిలు చెల్లించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీన జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పిస్తామని, అవసరమైతే రాజకీయ పార్టీల నేతలతో పాటు రైతులు రోడ్లపైకి రావాల్సిందేనని పిలుపునిచ్చారు.
షుగర్ ఫ్యాక్టరీని కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోంది: మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్
సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కూడా కూటమి ప్రభుత్వం కాపాడలేకపోతోందని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమరనాథ్ మండిపడ్డారు. ఈ విషయంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్లో ఎలాంటి చలనం లేదని విమర్శించారు. వైయస్ఆర్‌సీపీ పాలనలో ప్రతి సీజన్‌లో రైతులకు సమయానికి బకాయిలు చెల్లించేవారని గుర్తుచేశారు. చోడవరం షుగర్ ఫ్యాక్టరీని ఆదుకునేందుకు వైయస్ జగన్ గారు 90 కోట్ల రూపాయలు విడుదల చేసి సహకార రంగంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీని కాపాడారని తెలిపారు. స్పీకర్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఒక షుగర్ ఫ్యాక్టరీని కూడా ఆదుకోలేకపోతోందని మండిపడ్డారు. సంక్రాంతి లోపు బకాయిలు చెల్లించకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు.
షుగర్ ఫ్యాక్టరీని ఆదుకున్నది వైయస్ జగన్ గారే: మాజీ మంత్రి బుడి ముత్యాల నాయుడు
షుగర్ ఫ్యాక్టరీని నిజంగా ఆదుకున్నది వైఎస్ జగన్ గారే అని మాజీ మంత్రి బుడి ముత్యాల నాయుడు స్పష్టం చేశారు. షుగర్ ఫ్యాక్టరీ ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితికి చేరుతుందని ఊహించలేదన్నారు. ఫ్యాక్టరీని వెంటనే ప్రారంభించి రైతులకు బకాయిలు చెల్లించాలన్నారు. వైయస్ జగన్ హయాంలో చెరుకు రైతులకు గిట్టుబాటు ధర లభించేదని, టీడీపీ పాలనలో ఫ్యాక్టరీ నష్టాల బాట పట్టిందని విమర్శించారు. ఒకప్పుడు ఐదున్నర లక్షల టన్నుల సామర్థ్యం గల చోడవరం షుగర్ ఫ్యాక్టరీ నేడు లక్షల టన్నులకు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి నేతలు మాట తప్పారు: మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ
ఎన్నికలకు ముందు చోడవరం షుగర్ ఫ్యాక్టరీని ఆదుకుంటామని హామీ ఇచ్చిన కూటమి నేతలు, ఇప్పుడు మాట తప్పారని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. గత ఏడాది క్రషింగ్ చేసిన లక్ష టన్నుల షుగర్ ఏమైందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీకి వెంటనే 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 90 కోట్ల రూపాయలు తీసుకువచ్చామని గుర్తుచేశారు. రైతులు కష్టాల్లో ఉంటే టీడీపీ ఎమ్మెల్యేలు రాజు, బండారు సత్యనారాయణ నిద్రపోతున్నారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ పాలనలో రైతులకు ఒక్క రూపాయి కూడా బకాయిలు లేవన్నారు.
అనకాపల్లి పార్లమెంటు వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి పాలనలో షుగర్ ఫ్యాక్టరీ రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల ముందు ఫ్యాక్టరీని ఆదుకుంటామని ఇచ్చిన హామీలను ఎన్నికల తర్వాత పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు.